గ్రహ పీడలను తొలగించే ఆంజనేయుడు

మహాశక్తిమంతుడైన హనుమంతుడు ఎక్కడ కొలువై వుంటే అక్కడ మానసిక ... శారీరక రుగ్మతలు ఉండవని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాంటి హనుమంతుడు వివిధ ముద్రలతో ... నామాలతో అనేక ప్రదేశాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. ఆ స్వామి కొలువైన ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి 'హాలియా' లో కనిపిస్తుంది.

నల్గొండ జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రం సాగర్ ప్రధాన కాలువ సమీపంలో కొలువై వుంది. రామ - రావణ సంగ్రామ సందర్భంలో లక్ష్మణుడు 'మేఘనాథుడు'తో తలపడతాడు. ఆ సమయంలో లక్ష్మణుడు కుప్పకూలిపోవడంతో, అక్కడి ప్రముఖులు 'సంజీవిని' మొక్క గురించి ప్రస్తావిస్తారు. ఆ మొక్క కోసం వెళ్లిన హనుమంతుడు, దానిని వెదికే సమయం లేకపోవడంతో ఆ పర్వతాన్నే మోసుకుని వస్తాడు.

ఇక్కడి హనుమంతుడు ఆ ముద్రలోనే శిలారూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ప్రతి మంగళవారం స్వామివారికి సిందూర అభిషేకం ... ఆకుపూజలు జరుగుతూ ఉంటాయి. ఈ పూజల ఫలితంగా ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. సాధారణంగా పిల్లలకి 'దిష్టి' తగిలితే పెద్దలు తమకి తెలిసిన విధంగా ఆ దిష్టిని తీసేస్తుంటారు.

అయినా ఆ ప్రభావం నుంచి పిల్లలు బయటపడలేకపోతే, ఈ క్షేత్రానికి తీసుకుని వస్తుంటారు. స్వామిని దర్శించి అభిషేక సిందూరాన్ని నుదుటున ధరించడంతో పిల్లలు వెంటనే ఆ ప్రభావం నుంచి బయటపడతారని చెబుతారు. ఇక గ్రహ పీడల వలన కూడా కొంతమంది నానా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వాళ్లు ఇక్కడి స్వామిని దర్శించుకుని సేవిస్తే మంచి ఫలితం కనిపిస్తుందని అంటారు.

ఇక్కడి హనుమంతుడిని ఆరాధ్య దైవంగా భావించి అనునిత్యం ప్రదక్షిణలు చేసే వాళ్లు పెద్ద సంఖ్యలో కనిపిస్తుంటారు. స్వామివారికి ప్రదక్షిణలు చేయడం వలన మనసులోని ధర్మబద్ధమైన కోరిక అనతికాలంలోనే నెరవేరుతుందని చెబుతుంటారు. ఇలా భగవంతుడి అనుగ్రహానికి ... భక్తుల విశ్వాసానికి ప్రతీకగా ఈ క్షేత్రం విలసిల్లుతోంది. దర్శనమాత్రం చేతనే కోరిన వరాలను ప్రసాదిస్తోంది.


More Bhakti News