అసత్యాన్ని సహించని దుర్గానాగేశ్వరుడు

ఆదిదేవుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన ప్రాచీన క్షేత్రాల్లో 'పెదకళ్ళేపల్లి' ఒకటిగా కనిపిస్తుంది. పురాణాల్లో కదళీపురం పేరుతో కనిపించే ఈ క్షేత్రంలో దుర్గానాగేశ్వరస్వామి స్వయంభువు మూర్తిగా దర్శనమిస్తూ ఉంటాడు. ఇక్కడ స్వామివారు ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనడానికి నిదర్శనంగా అనేక సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటిగా 'సత్య స్తంభం' గురించి చెబుతుంటారు.

ప్రాచీనకాలంలో ఎవరైనా అవినీతికీ ... అన్యాయానికి పాల్పడితే, ఆరోపణలు ఎదుర్కున్న వ్యక్తి, తనపైపడిన నింద .. నిజం కాదని నిరూపించుకోవలసి వచ్చేది. ఈ తతంగం పెద్దల సమక్షంలోను ... దైవ సన్నిధిలోను జరుగుతూ ఉండేది. అలా ఆనాటి దేవాలయాలో మొదలైన సత్య నిరూపణ ... నేటికీ కొన్నిక్షేత్రాల్లో కొనసాగుతూనే వుంది. అలాంటి క్షేత్రాల జాబితాలో పెదకళ్ళేపల్లి కూడా దర్శనమిస్తుంది.

పూర్వం ఇక్కడి స్వామి సన్నిధిలో ... అంటే ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సత్యస్తంభం దగ్గర సత్యనిరూపణ జరుగుతూ ఉండేది. ఈ నేపథ్యంలో అమాయకుడు ... నిజాయితీపరుడైన ఒక వ్యక్తిని మరొక వ్యక్తి మోసం చేశాడట. చేసిన మోసాన్ని స్వామి సన్నిధిలో .. సత్యస్తంభం చెంత అతను అంగీకరించకుండా అసత్యమాడాడు. అంతే ... ఫెళ ఫెళ మంటూ ఆ సత్య స్తంభం విరిగి అతనిపై పడటంతో అక్కడే మరణించాడు.

ఆనాటి నుంచి ఇక్కడి స్వామివారి సన్నిధిలో ఎవరు ఎలాంటి పరిస్థితుల్లోను అసత్యమాడరని స్థానికులు చెబుతుంటారు. ఒకవేళ అసత్యమాడే సాహసం ఎవరైనా చేస్తే అందుకు తగిన ఫలితాన్ని వెంటనే పొందుతారని అంటారు. ఈ విషయాన్ని స్పష్టం చేయడానికేనన్నట్టుగా గతంలో విరిగిన ఆ స్తంభం ఇప్పటికీ ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా దీనికి నమస్కరించుకునే స్వామి దర్శనానికి వెళుతూ ఉంటారు. దుర్గా నాగేశ్వరస్వామి కృపాకటాక్షాలకు పాత్రులవుతుంటారు.


More Bhakti News