లక్ష్మీదేవిని ఈ రోజున ఆరాధిస్తే కలిగే ఫలితం !

లక్ష్మీదేవిని అనునిత్యం ఆరాధించవచ్చు ... సేవించవచ్చు. అయితే కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో అమ్మవారిని ఆరాధించడం వలన లభించే ఫలితం మరింత విశేషంగా ఉంటుందని చెప్పబడుతోంది. లక్ష్మీదేవి ఎక్కడ వుంటే అక్కడ సిరిసంపదలు ఉంటాయి ... సిరిసంపదలు ఎక్కడ ఉంటే అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి.

అందుకే లక్ష్మీదేవిని పూజించడం వలన దారిద్ర్య బాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. దారిద్ర్యం అనేకమైన ఇబ్బందులకు గురిచేస్తుంది ... తీవ్రమైన నిరాశా నిస్పృహలను కలిగిస్తుంది. అలాంటి బాధల నుంచి బయటపడాలంటే కొన్ని విశేషమైన రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తూ ... సేవిస్తూ ఉండాలి.

అలాంటి విశేషాన్ని సంతరించుకున్న రోజుగా 'కార్తీక శుద్ధ సప్తమి' చెప్పబడుతోంది. దీనినే శాక సప్తమి అని కూడా పిలుస్తుంటారు ... ఈనాటి పూజను వ్రతంలా ఆచరిస్తూ ఉంటారు. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించవలసి ఉంటుంది. పూజా మందిరంలో అమ్మవారి ప్రతిమను పూలతో అలంకరించి షోడశ ఉపచారాలతో పూజించాలి.

ఇక నైవేద్యం విషయానికి వస్తే తాజాగా వున్న వివిధ రకాల పచ్చి కూరగాయలను అమ్మవారికి సమర్పించవలసి ఉంటుంది. ఆ తరువాత ఆ పచ్చి కూరగాయాలనే ఆహారంగా స్వీకరించాలి. ఈ విధంగా ప్రకృతి ప్రసాదించిన వివిధ కూరగాయలని ఆ తల్లికి సమర్పించి, వాటినే ఆహారంగా తీసుకోవడం ఈ రోజుకి గల విశేషంగా కనిపిస్తుంది.

అమ్మవారు ప్రసాదించిన ఆహారాన్ని ముందుగా ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత స్వేకరించడం వలన ఆమె పట్ల కృతజ్ఞతా భావాన్ని తెలుపుతున్నట్టు అవుతుంది. ఈ విధంగా చేయడం వలన సంపదలు చేకూరతాయనీ ... ఆకలితో బాధపడే పరిస్థితి ఎప్పటికీ రాదని చెప్పబడుతోంది.


More Bhakti News