ఈ పద్ధెనిమిది మెట్లు వీటికి ప్రతీకనట !

కార్తీకమాసంలో అయ్యప్పస్వామి దీక్షధారణ ఎక్కువగా జరుగుతూ వుంటుంది. మండలకాలంపాటు దీక్షను చేపట్టేవాళ్లు కొందరైతే, కార్తీకంలో దీక్ష తీసుకుని 'మకరజ్యోతి దర్శనం' వరకూ కొనసాగేవాళ్లు మరికొందరు. ఈ మాసమంతా కూడా ఎక్కడ చూసినా అయ్యప్ప ఆలయాలు భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ కనిపిస్తుంటాయి.

ఇక అనేక నియమాలను పాటిస్తూ దీక్షాకాలాన్ని పూర్తిచేసుకుని 'శబరిమల' స్వామి దర్శనానికి వెళుతూ వుంటారు. అడవులు ... కొండలు దాటుకుంటూ స్వామి దర్శనం చేసుకుని సంతృప్తి చెందుతుంటారు. ఇక్కడ పద్ధెనిమిది మెట్లు అధిరోహించి స్వామిని దర్శించుకోవలసి ఉంటుంది. దీక్ష తీసుకున్నవారు మాత్రమే ఈ మెట్లను అధిరోహించే అర్హత కలిగివుంటారు.

ఈ పద్ధెనిమిది మెట్లకి గల విశిష్టత అంతా ఇంతా కాదు. ఆలయ ప్రతిష్ఠ సదర్భంలో పద్ధెనిమిది వాయిద్యాలను మ్రోగించారట. ఈ మెట్లను ఆ వాయిద్యాలకు ప్రతీకగా చెబుతుంటారు. అష్టదిక్పాలకులతో కలిపి ఇక్కడ పద్దెనిమిది మందిదేవతలు అదృశ్యరూపంలో వున్న కారణంగా ఈ మెట్లు వారికి ప్రతీకగా చెబుతుంటారు.

ఇక శబరిమలలో స్వామివారి సన్నిధికి చేరుకోవడానికి వెళ్లే మార్గంలో పద్ధెనిమిది కొండలు ప్రధానమైనవిగా చెప్పబడుతున్నాయి. కాళ్తే కట్టి .. ఇంజిపారై .. పుదుచ్చేరి మలై .. శబరమలై .. నీలిమలై .. పొన్నంబలమేడు .. చిట్రంబలమేడు .. మయిలాడుం మేడు .. తలైపారై .. నీలక్కల్ .. దేవన్ మలై .. శ్రీపాదమలై .. కల్కిమలై .. మాతంగమలై .. సుందరమలై .. నాగమలై .. గవుండమలై .. శబరిమలై .. అనేవి ఈ పద్ధెనిమిది కొండల జాబితాలో కనిపిస్తాయి.

ఈ పద్దెనిమిది కొండలకు ఈ పద్ధెనిమిది మెట్లు ప్రతీకగా చెబుతుంటారు. ఇలా 'పదునెట్టాంబడి' పేరుతో పిలవబడుతూ ... అత్యంత పవిత్రమైనవిగా కొలవబడుతోన్న ఈ పద్ధెనిమిది మెట్లను గురించి అనేక విశేషాలు చెప్పబడుతున్నాయి. ప్రతి సంవత్సరం దీక్షను చేపడుతూ పద్ధెనిమిదిసార్లు ఈ మెట్లను ఎక్కినవాళ్లు తమ జీవితం ధన్యమైనట్టుగా విశ్వసిస్తుంటారు.


More Bhakti News