దేవుడి దృష్టి నుంచి ఎవరు తప్పించుకోగలరు ?

అనంతమైన ఈ విశ్వాన్ని ఆక్రమించుకుని భగవంతుడు వున్నాడు. ఆయన లేని ప్రదేశం లేదు ... ఆయన దృష్టి నుంచి తప్పించుకున్నవారు లేరు. ఈ విషయం తెలియనివాళ్లు అన్యాయానికి పాల్పడుతూ ఆయనకి దొరికిపోతుంటారు ... తగిన శిక్షను అనుభవిస్తుంటారు. అందుకు ఉదాహరణగా 'నందివెలుగు' లో జరిగిన ఒక సంఘటనను గురించి చెప్పుకోవచ్చు.

మహిమాన్వితమైన ఈ క్షేత్రం గుంటూరు జిల్లా తెనాలి మండలంలో విలసిల్లుతోంది. అగస్త్యమహర్షి ప్రతిష్ఠించిన కారణంగా ఇక్కడి పరమశివుడు ... అగస్త్యేశ్వరుడుగా పిలవబడుతుంటాడు. కాలక్రమంలో చాళుక్య ప్రభువైన 'విష్ణువర్ధనుడు' స్వామివారికి రత్నకాంతులతో నిత్యాభిషేకం జరగాలని ముచ్చటపడతాడు.

స్వామి సన్నిధిలో వినాయకుడునీ ... నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తాడు. గణపతి గర్భంలోను ... నంది కొమ్ములలోను రత్నాలను అమర్చి, ఆ రత్నాల కాంతులు శివలింగంపై పడేలా చేస్తాడు. ఈ రహస్యం తెలుసుకున్న ఓ మాంత్రికుడు అత్యంత ఖరీదైన ఆ రత్నాలను అపహరించాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్న ప్రకారం ఓ రాత్రివేళ ఆ రత్నాలను దొంగిలించి వెనుదిరుగుతాడు.

అయితే గ్రామదేవతలు ఆ మంత్రగాడిని అడ్డుకుని అతన్ని అక్కడి నుంచి కదలకుండా చేస్తాయి. వాటి బారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఆ మంత్రగాడిని స్వామివారే అంతమొందించాడట. ఇందుకు సంబంధించిన ఆనవాళ్లను కూడా ఇక్కడ చూపుతుంటారు. ఈ కారణంగా స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని భక్తులు విశ్వసిస్తుంటారు. మహిమాన్వితమైన మహాదేవుడిని మనసారా కొలుస్తుంటారు.


More Bhakti News