దీపావళి రోజున అనుగ్రహించే కుబేరుడు

సమస్త సిరిసంపదలతో తులతూగే వాళ్లను 'కుబేరుడు'తో పోల్చడం జరుగుతూ వుంటుంది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో వాళ్ల ఇంట 'నవనిధులు' నాట్యం చేస్తుంటాయని చెప్పుకుంటూ వుంటారు. కుబేరుడి అనుగ్రహమే అందుకు కారణమని అనుకుంటూ వుంటారు.

అయితే అసలు ఈ కుబేరుడు ఎవరు ? ఆయన సంపదలను ఎలా ప్రసాదించగలడు ? అనే సందేహం కొంతమందికి కలుగుతూ వుంటుంది. సమస్త ధనరాశులకు కుబేరుడు అధినాయకుడిగా ... అధ్యక్షుడుగా చెప్పబడుతున్నాడు. నవనిధులుగా చెప్పబడుతోన్న ధనరాశులకు ఆయన ఆధిపత్యం వహిస్తుంటాడు. శంఖ .. నీల .. పద్మ .. మహాపద్మ .. ముకుంద .. కుంద .. వర్చసు .. కచ్చప .. మకర అనేవి నవనిధులుగా చెప్పబడుతున్నాయి.

మంచి మనసున్న కారణంగా తనని అడిగినవారికి లేదనకుండా కుబేరుడు సిరిసంపదలను ప్రసాదిస్తూ ఉంటాడు. ఆ మంచితనంతోనే ఆయన సమస్త దేవతలను ఆకట్టుకున్నాడు. కుబేరుడు సద్గుణ సంపన్నుడు కావడం వల్లనే ఆయన సభామందిరంలో సమస్త దేవతలు ... మహర్షులు ... ముఖ్యంగా రాజ్యలక్ష్మీదేవి ... శివపార్వతులు కూడా కొలువుదీరి ఉంటారట. అందువలన ఆయనని పూజించడం వలన వీరందరి అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడుతోంది.

సాధారణంగా 'దీపావళి' రోజున అంతా లక్ష్మీదేవిని అనుగ్రహాన్ని ఆశిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆమెను ఆరాధిస్తూ వుంటారు. అలాగే కుబేరుడి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్లు కూడా ఆయనని ఇదే రోజున పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. దీపావళి రోజున ఎవరైతే కుబేరుడిని పూజిస్తారో, వాళ్లు ఆయన కరుణా కటాక్షాలతో సంపన్నులు అవుతారని స్పష్టం చేయబడుతోంది. అందువలన సకల సంపదలను ప్రసాదించే కుబేరుడిని దీపావళి రోజున పూజించడం మరచిపోకూడదు.


More Bhakti News