కదిలివచ్చే కరుణాసాగరుడు బాబా

ప్రతి పూజా మందిరంలోను ఇప్పుడు బాబా చిత్రపటంగానీ ... బాబా ప్రతిమగాని కనిపిస్తుంది. అలాగే ప్రతి గ్రామంలోను ... కాలనీల్లోనూ బాబా ఆలయం దర్శనమిస్తుంది. ప్రతి ఒక్కరికి బాబాతో పెనవేసుకుపోయిన బంధమే అందుకు కారణం. ఆపదల్లో నుంచి బాబా బయటపడేసిన అనుభవవాన్ని అందరూ పొందడం వల్లనే ఆయన ఆరాధన పెరుగుతూ వస్తోంది.

ఈ నేపథ్యంలో నిర్మించబడిన ఆలయం ఒకటి మనకి 'మేడేపల్లి' లో దర్శనమిస్తుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పరిధిలో గల ఈ గ్రామంలో బాబా ఆలయం అలరారుతోంది. సువిశాలమైన ప్రదేశంలో అందమైన నగిషీలతో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దిన తీరు ఆనందాశ్చర్యాలను కలిగిస్తుంది. ఇక్కడి బాబా కరుణతో నిండిన చూపులతో భక్తులను పలకరిస్తున్నట్టుగా కనిపిస్తుంటాడు.

ఈ ప్రాంగణంలో అడుగుపెడుతూ ఉండగానే ఎవరు ఏ సమస్యతో బాధపడుతూ తన దగ్గరికి వచ్చారనేది ఆయనకి తెలిసిపోతుందని చెబుతుంటారు. బాబా ఎదురుగా నుంచుని రెండు చేతులు జోడించి నమస్కరిస్తే చాలు, అనేక రకాల సమస్యలతో సతమతమైపోతున్న మనసుకి ఒక్కసారిగా ఉపశమనం లభిస్తుందని అంటారు. ఆయన అనుగ్రహంతో కావలసినవి పొందిన వాళ్లెందరో ఇక్కడ కనిపిస్తుంటారు.

శిరిడీలో మాదిరిగానే అభిషేకాలు ... హారతులు ... అలంకారాలు ... ప్రత్యేక సేవలు నిర్వహిస్తుంటారు. ఇక్కడి బాబా పాదాలను ఆశ్రయించిన వాళ్లు ఆయన అనుగ్రహాన్ని పొందకుండా తిరిగి వెళ్లరని భక్తులు విశ్వసిస్తుంటారు. మనసు మందిరంలో ఆయన రూపాన్ని ప్రతిష్ఠించుకుని తిరిగి వెళుతుంటారు.


More Bhakti News