కోరిన వరాలనిచ్చే కొండంత దేవుడు

ఎన్ని కష్టాలు ఎదురైనా శ్రీరాముడు ధర్మం తప్పకుండా నడచుకున్నాడు. భర్తపట్ల ప్రేమతో అన్ని కష్టాలను సీతమ్మ ఆనందంగా భరించింది. అందుకే లోకానికి సీతారాములు ఆదర్శప్రాయమయ్యారు. అశేష భక్త జనులచే ఆరాధనలు అందుకుంటున్నారు. సీతారాములను దర్శిస్తేచాలు జన్మ ధన్యమైపోతుందని భావిస్తుంటారు.

ఈ కారణంగానే ప్రతి గ్రామంలోను రామాలయం అలరారుతూ కనిపిస్తుంది. శ్రీరామనవమి ... ఊరంతా కలిసి జరుపుకునే ఉత్సవమైంది. అలా భక్తులచే నిత్యనీరాజనాలు అందుకుంటోన్న రామాలయాలలో ఒకటి 'మిరియాల' గ్రామంలో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా 'నూతన్ కల్' మండలంలో ఈ ఆలయం విలసిల్లుతోంది.

వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఆనాటి ప్రాచీన వైభవానికి అద్దంపడుతూ వుంటుంది. గర్భాలయంలో సీతారామలక్ష్మణులు ... హనుమంతుడు కొలువుదీరి దర్శనమిస్తూ వుంటారు. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. ఇక్కడి స్వామివారిని పూజించడం వలన కోరిన వరాలను అనుగ్రహిస్తాడని భక్తులు చెబుతుంటారు.

ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతూ వుంటాయి. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. తమని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తోన్న స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకుని ఆయన ఆశీస్సులు అందుకుంటూ వుంటారు.


More Bhakti News