శ్రీ కృష్ణావతారం

దశావతారాలలో శ్రీ కృష్ణావతారం పరిపూర్ణమైనదని అంటారు. అందుకే ఆయన కృష్ణ పరమాత్మగా భక్తులచే పూజలు అందుకుంటున్నాడు. శ్రీ కృష్ణుడు తన బాల క్రీడలతోనే భక్తులకు కావలసినంత జ్ఞానాన్ని బోధించాడు. నల్లని కుండ అజ్ఞానానికి సంకేతమైతే, తెల్లని వెన్నవిజ్ఞానమనే వెలుగుకు గుర్తు. అజ్ఞానమనే చీకటిని తరిమేసి జ్ఞానామృతాన్ని సాధించాలనేదే కృష్ణుడి సందేశం.

భూలోకంలో రాక్షసుల ఆగడాలు రోజు రోజుకి పెరిగి పోతుండటంతో, ఆ పాపభారాన్ని భూమాత మోయలేకపోయింది. ఆమె అభ్యర్థన మేరకు శ్రీమన్నారాయణుడు ... రాక్షస సంహారానికై భూలోకాన కృష్ణుడిగా అవతరించాడు. దేవకీ వసుదేవుల అష్టమ గర్భాన జన్మించాడు.

దేవకీ అష్టమ గర్భాన జన్మించే వాడి వలన తనకు ప్రాణహాని వుందని తెలుసుకున్న మధుర పాలకుడు కంసుడు, ఆ దంపతులను బంధించి వారి సంతానాన్ని వధించసాగాడు. అష్టమ గర్భాన జన్మించిన కృష్ణుడుని, ఆ రాత్రే వాసుదేవుడు ఊరు దాటించి యశోద ఇంటికి చేరుస్తాడు. నంద -యశోదలు ఆ శిశువుకి కృష్ణ అని నామకరణం చేసి కన్నయ్యగా అపురూపంగా చూసుకోసాగారు.

కొంత కాలం తరువాత విషయం తెలుసుకున్న కంసుడు, కృష్ణుడిని సంహరించడానికి అనేక మంది రాక్షసులను పంపించాడు. అలా వచ్చిన పూతన ... త్రుణా వర్తుడు ... బకాసురుడు ... అగాసురుడు ... కృష్ణుడి చేతిలో హతమయ్యారు. బలరామ కృష్ణులను విందుకు ఆహ్వానించి, వారిని అంతం చేసేందుకు కంసుడు ప్రయత్నిస్తాడు. దాంతో వాళ్లిద్దరూ కలిసి కంసుడిని సంహరిస్తారు.

ఇక జయ అనే ద్వారపాలకుడు శిశుపాలుడిగా జన్మించగా, అతని తల్లి కోరిక మేరకు నూరు తప్పుల వరకూ క్షమించి, ఆ తరువాత అతణ్ణి కృష్ణుడు సంహరించాడు. అష్ట భార్యలతో తుల తూగుతున్నప్పటికీ, తన బాల్య స్నేహితుడైన కుచేలుడిని మరిచిపోని కృష్ణుడు, మహాభారత యుద్ధంలో ధర్మాన్ని గెలిపించే విషయంలో కీలకమైన పాత్రను పోషించాడు. ప్రతి తల్లి తన బిడ్డలో ఓ చిన్ని కృష్ణుడిని చూసుకునేలా ఆ జగన్నాథుడు, భూలోక వాసుల హృదయాలపై చెరగని ముద్ర వేశాడు.


More Bhakti News