దేవుడి ప్రసాదం పట్ల నిర్లక్ష్యం పనికిరాదు

దేవాలయానికి వెళ్లినప్పుడు భగవంతుడిని దర్శించుకుని పూజ చేయించడం జరుగుతూ వుంటుంది. భగవంతుడి ప్రసాదంగా అర్చకుడు ఇచ్చిన కుంకుమ ... పుష్పం ... తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళుతుంటారు. ఆలయం లోపలికి వెళితే తమ పని ఆలస్యమై పోతుందేమోనని కొంతమంది బయటనుంచే నమస్కరించుకుని వెళుతూ వుంటారు.

ఇక దేవాలయానికి వెళ్లి వస్తూ ఎదురుపడిన వాళ్లు అక్కడి ప్రసాదాన్ని ఇస్తే, ఇంటికి రాగానే దానిని ఎక్కడో ఒకచోట పెట్టి మరిచిపోవడం చేస్తుంటారు. భగవంతుడి కోసం సమయాన్ని కేటాయించకపోవడం ... ఆయన ప్రసాదాన్ని పవిత్రంగా భావించకపోవడమంటే ఓ రకంగా అది ఆయనని అవమానపరచడమే అవుతుంది. ఆ ధోరణి దోషంగా మారి కొన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది.

ఇలాంటి ప్రవర్తన కారణంగా సాక్షాత్తు ఇంద్రుడే ఇబ్బందుల్లో పడినతీరు మనకి పురాణాల్లో కనిపిస్తుంది. ఒకసారి దూర్వాస మహర్షి శ్రీమన్నారాయణుడిని దర్శించుకుని వస్తూ వుండగా, దేవేంద్రుడు తారసపడతాడు. వినయ పూర్వకంగా దేవేంద్రుడు నమస్కరించడంతో, తనకి నారాయణుడు ఇచ్చిన పారిజాత పుష్పాన్ని ప్రసాదంగా ఆయన దేవేంద్రుడికి ఇస్తాడు.

ఆ పుష్పాన్ని అందుకున్న వెంటనే దేవేంద్రుడు దానిని 'ఐరావతం' తలపై పెడతాడు. అది చూసిన దూర్వాసుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. శ్రీమన్నారాయణుడి ప్రసాదం ఏదైనా అది అత్యంత పవిత్రమైనదిగా భావించి స్వీకరించాలనీ ... భక్తి భావంతో వ్యవహరించాలని చెబుతాడు. అలా చేయకపోతే అది నారాయణుడి పట్ల నిర్లక్ష్య భావాన్ని సూచిస్తూ ఉంటుందని అంటాడు.

స్వామివారి ప్రసాదానికి ఎవరైతే తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పెడతారో, అలాంటివారికి దూరంగా లక్ష్మీదేవి వెళ్లిపోతుందని చెబుతాడు. లక్ష్మీదేవి లేని చోటు కళావిహీనమై ... అనేక కష్ట నష్టాలకు వేదికగా మారుతుందని అంటాడు. ఆయన అన్నట్టుగానే అసురుల కారణంగా ఇంద్ర పదవిని కోల్పోయిన దేవేంద్రుడు కొంతకాలం పాటు నానాఇబ్బందులు పడతాడు. ఆ తరువాత స్వామివారికి క్షమాపణ చెప్పుకుని తిరిగి పూర్వ వైభవాన్ని పొందుతాడు.

అందువలన భగవంతుడి ప్రసాదంగా లభించినది ఏదైనా దానిని ఎంతో పవిత్రమైనదిగా భావించాలి ... ఎలాంటి పరిస్థితుల్లోను దానిని వదులుకోకుండా భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. అప్పుడే ఆయన కరుణా కటాక్ష వీక్షణాలు లభిస్తాయి. సకల శుభాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాయి.


More Bhakti News