ఆపదలో ఆదుకునే సాయిబాబా

తనవారంటూ ఎవరూ లేకపోయినా శిరిడీకి చేరుకొని, అక్కడి వారందరిని తన వాళ్లుగా చేసుకున్నవాడిగా సాయిబాబా కనిపిస్తాడు. ఆకలి సమయానికి కొంత ఆహారం ... తన దగ్గరికి వచ్చేవారి దగ్గర నుంచి రెండు రూపాయలను మినహా ఆయన ఎవరినీ ఏదీ కావాలని అడగలేదు.

తాను గ్రహించిన భిక్షలో నుంచి ముందుగా కొంత మూగజీవాలకు పెట్టేవాడు. ఇక ఎవరినైతే పాపాల నుంచి బయటపడేయాలని ఆయన అనుకుంటాడో ఆ ప్రయత్నంలో భాగంగానే వాళ్ల నుంచి రెండు రూపాయలను గ్రహించేవాడు. ఇలా ప్రేమ ... అనురాగం ... త్యాగం ... సంతోషం ... సంతృప్తి కలిసి సంతరించుకున్నదిగా బాబా రూపం కనిపిస్తూ వుంటుంది.

ప్రేమ అనే ఆయుధంతోనే ఆయన అందరి మనసులను గెలుచుకున్నాడు. అందుకే ఆయన భక్తుల హృదయ సింహాసనాన్ని అధిష్ఠించి యోగి మహారాజ్ గా పూజలు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే అనేక ప్రాంతాలలో ఆయన ఆలయాలు దర్శనమిస్తున్నాయి. అలాంటి ఆలయాల జాబితాలో మరింత ప్రత్యేకతను సంతరించుకున్నదిగా 'నకిరేకల్' బాబా ఆలయం కనిపిస్తుంది.

నల్గొండ జిల్లా పరిధిలో గల ఈ ఆలయం ... అచ్చు శిరిడీలోని ఆలయాన్ని పోలివుండటం విశేషం. భారీ నిర్మాణంగా రూపుదిద్దుకున్న ఈ ఆలయంలో భక్తులకు లభించిన బహుమానంగా బాబా దర్శనమిస్తాడు. బాబాకి ఇక్కడ జరిగే పూజలు ... సేవలు ఆయనపట్ల భక్తులకు గల అసమాన భక్తికి నిదర్శనంగా కనిపిస్తూ వుంటాయి.

ఆపదలో వున్నవారిని ఆదుకోవడం బాబా సహజ గుణమనీ, ఆయనని వేడుకుంటే లభించనిదేదీ ఉండదని భక్తులు చెబుతుంటారు. అనునిత్యం ఈ ఆలయం బాబా భజనలతో మారుమోగుతూ వుంటుంది. ఆయన చల్లని ఆశీస్సులను ఆప్యాయంగా అందజేస్తూ వుంటుంది.


More Bhakti News