విశిష్టమైన పంచముఖ హనుమ క్షేత్రం

పంచముఖ హనుమంతుడు కొలువుదీరిన విశిష్టమైన క్షేత్రాల్లో, 'పంచవటి' ఒకటిగా కనిపిస్తుంది. ఈ పంచవటి ... చెన్నైలోని 'విల్లిపురం' జిల్లాలో విలసిల్లుతోంది. మైరావణుడి ప్రాణాలు తుమ్మెదల రూపంలో సంచరిస్తూ వుంటాయి. ఆయన ప్రాణాలను హరించడం కోసం స్వామి ఇలా పంచముఖ హనుమంతుడిగా విశ్వరూపాన్ని ధరించాడని చెప్పడం జరుగుతోంది.

ఈ రూపంలో వరాహస్వామి ... హయగ్రీవుడు ... నారసింహుడు ... గరుత్మంతుడి శక్తిని కలిగినవాడిగా హనుమంతుడు దర్శనమిస్తూ వుంటాడు. అలాంటి పంచముఖ హనుమంతుడు, 10 అడుగుల పద్మపీఠంపై 36 అడుగుల మూలమూర్తిగా దర్శనమిచ్చే క్షేత్రంగా పంచవటి క్షేత్రం కనిపిస్తుంది.

చాలాకాలం క్రిందట హనుమంతుడిని ఉపాసించే ఒక భక్తుడు ఈ ప్రదేశం మీదుగా వెళుతుండగా హనుమంతుడు పిలిచినట్టుగా అనిపించిందట. అంతే కాకుండా ఒక కోతి వచ్చి ఆయన పంచపట్టుకుని ఈ ప్రదేశానికి తీసుకువచ్చిందట. పూర్వం ఇక్కడ హనుమంతుడు మహర్షుల పూజలు అందుకున్నాడని భావించిన ఆయన, ఇక్కడ స్వామివారికి ఆలయాన్ని నిర్మించాడని స్థలపురాణం చెబుతోంది.

మహిమాన్వితుడైన మారుతిని దర్శిస్తేచాలు ... మనోవాంఛలు వెంటనే నెరవేరతాయని భక్తులు చెబుతుంటారు. హనుమజ్జయంతితో పాటు సీతారాముల కల్యాణం ... పవిత్రోత్సవాలు ఇక్కడ ఘనంగా జరుపుతుంటారు. సువిశాలమైన ఈ ఆలయ ప్రాంగణంలో పట్టాభిరాముడికి ... వినాయకుడికి ఉపాలయాలు కనిపిస్తాయి. ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతూ భక్తిభావ పరిమళాలను వెదజల్లుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన అనిర్వచనీయమైన ఆనందానుభూతులు కలుగుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News