వామనావతారం

శ్రీ మహావిష్ణువు లోక కల్యాణం కోసం ప్రశాంతంగా తన పనిని తాను చక్కబెట్టడానికి ఎత్తిన అవతారం 'వామనావతారం'అని చెప్పుకోవచ్చు. ఎలాంటి యుద్ధాలు చేయకుండానే, అవతలివారి బలహీనతను బట్టి కాగల కార్యాన్ని జరిపించడంలో శ్రీ మహావిష్ణువు చూపే నేర్పు ఈ అవతారంలో కనిపిస్తుంది.

ఒకసారి శ్రీమన్నారాయణుడి కోసం దేవేంద్రుడి తల్లి నిష్టగా ఒక వ్రతాన్ని ఆచరించింది. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం కావడంతో, తన కుమారుడైన ఇంద్రుడిని రాక్షస రాజైన బలిచక్రవర్తి పరాజితుడిని చేసి స్వర్గాధి పత్యం చేపట్టాడని చెప్పింది. తిరిగి ఆ పదవిని తన కుమారుడికి ఇప్పించమని ప్రాధేయపడింది. దాంతో ఆమె పుత్రుడిగా జన్మించి ఆ కోరికను నెరవేరుస్తానని శ్రీ మహావిష్ణువు మాట ఇచ్చాడు.

బలిచక్రవర్తి దాణ గుణ సంపన్నుడనీ ... ఆడినమాట తప్పడని తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు, అదితి గర్భాన జన్మించాడు. ఉపనయన సంస్కారాలు పూర్తి చేసుకున్న వామనుడు, తాను అనుకున్నది సాధించడానికి సిద్ధపడ్డాడు. 'భ్రుగుకచ్ఛ' మనే ప్రదేశంలో బలి చక్రవర్తి 'అశ్వమేథయాగం' చేస్తున్నాడని తెలిసి వామనుడు అక్కడికి వెళ్లాడు. బ్రాహ్మణ బ్రహ్మచారి అయిన వామనుడిని బలి మర్యాద పూర్వకంగా ఆహ్వానించాడు.

ఏం కావాలో కోరుకోమని బలి అడగడంతో, తనకి మూడు పాదముల నేల చాలునని చెప్పాడు వామనుడు. అందులో ఏదో మర్మముందని శుక్రాచార్యుడు గ్రహించి బలిని వారించాడు. అయినా అతను వినిపించుకోకపోవడంతో, దానం చేయు సందర్భంలో సంకల్పం చెప్పు జలపాత్రలో శుక్రాచార్యుడు మాయా రూపంలో ప్రవేశించాడు. అందులోనుంచి జలధార బయటికి రాకుండా నీటి ద్వారానికి అడ్డుపడ్డాడు. అది గ్రహించిన వామనుడు దర్భతో ఆ ద్వారంలో పొడిచాడు. ఫలితంగా చూపుకోల్పోయిన శుక్రాచార్యుడు ఒంటికన్ను వాడైనాడు.

అనంతరం వామనుడికి బలి మూడు పాదముల నేలను ధారాదత్తం చేశాడు. వామనుడు ఒక పాదమును నేలపై ... మరొక పాదమును ఆకాశం పై పెట్టి మూడవ పాదం దేనిపై మోపాలంటూ అడిగాడు. దాంతో వచ్చినది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని గ్రహించిన బలి, మూడవ పాదమును తన తలపై మోపమని కోరాడు. బలి గుణ సంపదకు మెచ్చిన శ్రీమహావిష్ణువు, అతని తలపై మూడవ పాదమును మోపి సుతల లోక రాజ్యమునకు రాజును చేశాడు. ఆ తరువాత ఇంద్రుడికి అతని పదవిని అప్పగించి తన మాట నిలబెట్టుకున్నాడు.


More Bhakti News