ఈ రోజున సరస్వతీదేవిని పూజించాలి

వెలుగు వలన చీకటి ... జ్ఞానము వలన అజ్ఞానం తరిమివేయబడతాయి. అలా అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే సంపదను ప్రసాదించే తల్లిగా సరస్వతీదేవి దర్శనమిస్తూ వుంటుంది. దుమ్ముచేత కప్పబడిన అద్దంలో ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. అలాగే అజ్ఞానం అలుముకుని ఉన్నంత వరకూ ఎవరూ కూడా సత్యాన్ని చూడలేరు ... భగవంతుడిని దర్శించలేరు.

జీవితంలో ఏ రంగాన్ని ఎంచుకుని ఎక్కడ విజయం సాధించాలన్నా అందుకు విజ్ఞానం ఎంతో అవసరం. అలాంటి విజ్ఞానాన్ని ప్రసాదించి ... ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి ... కీర్తిప్రతిష్ఠలను పెంచే తల్లిగా సరస్వతీదేవి దర్శనమిస్తూ వుంటుంది. అలాంటి అమ్మవారికి శరన్నవరాత్రులలో వచ్చే 'మూలా నక్షత్రం' రోజున విశేష పూజలు నిర్వహిస్తుంటారు.

అమ్మవారి జన్మ నక్షత్రమైన ఈ రోజున ఆ తల్లిని పూజించడం వలన ఆమె అనుగ్రహం వెంటనే లభిస్తుందని చెప్పబడుతోంది. అమ్మవారికి స్వచ్ఛమైన తెలుపు వర్ణం అంటే ఇష్టం. అందువలన అమ్మవారు చక్కని అంచుగల తెల్లని వస్త్రాలను ధరిస్తుంది. తెల్లని తామర పువ్వును ఆసనంగా చేసుకుని దర్శనమిస్తుంది. ఇక హంస తెల్లగా వుంటుంది కనుక అదే అమ్మవారి వాహనంగా కనిపిస్తుంది. అలాంటి అమ్మవారిని బ్రహ్మ .. విష్ణు .. మహేశ్వరులు అనునిత్యం స్తుతిస్తూ ఉంటారని పురాణాలు చెబుతున్నాయి.

అలాంటి అమ్మవారి ఆశీస్సులను కోరుతూ విద్యార్ధినీ విద్యార్థులు పూజించవలసి వుంటుంది. '' యాకుందేందు తుషారహార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా .. యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా .. యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభి దేవై స్సదా పూజితా .. సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా '' అని అమ్మవారిని ప్రార్ధించడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది.

ఫలితంగా విద్యా ... విజ్ఞాన సంబంధమైన రంగాల్లో వాళ్ల భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశిస్తుందని చెప్పబడుతోంది. ఈ కారణంగానే ఈ రోజున ఆలయాల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ వుంటాయి. విద్యార్థినీ విద్యార్థులు తమ పుస్తకాలు .. పెన్నులు అమ్మవారి సన్నిధిలో వుంచి పూజలు చేయిస్తుంటారు.


More Bhakti News