స్కందమాత మనసు ఇలా గెలుచుకోవాలి

నవరాత్రులలో మొదటిరోజున 'శైలపుత్రి'గా ... రెండవరోజున 'బ్రహ్మచారిణి'గా ... మూడవరోజున 'చంద్రఘంట'గా ... నాల్గొవ రోజున 'కూష్మాండ దుర్గ'గా దర్శనమిచ్చిన అమ్మవారు, అయిదవ రోజున అంటే 'పంచమి' రోజున 'స్కందమాత'గా భక్తులకు కనువిందు చేస్తుంది. కుమారస్వామికి 'స్కందుడు' అనే పేరు వుంది. ఆయన తల్లి కనుక అమ్మవారిని 'స్కందమాత'గా పిలుస్తుంటారు.

భక్తులను అనుగ్రహించడంలో తండ్రి వేగం ... తల్లి మనసు స్కందుడిలో కనిపిస్తాయి. అనేక దోషాలను నివారించి భక్తుల కోరికలను నెరవేర్చడంలో స్కందుడు ముందుంటాడు. ఈ కారణంగానే ఆయనని ఆరాధించే భక్తులంతా అమ్మవారిని స్కందమాతగా కొలుస్తుంటారు. తల్లీ కొడుకులుగా తమ అనురాగాన్ని ఆవిష్కరిస్తూ ఒడిలో షణ్ముఖుడితో అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. తన భక్తులను కాపాడే నిమిత్తం అమ్మవారు సింహ వాహనాన్ని అధిష్ఠించి తిరుగుతూ ఉంటుంది.

అమ్మవారికి 'పారిజాత పూలు' అత్యంత ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి. అందువలన నవరాత్రులలో అమ్మవారిని సాధ్యమైనంత వరకూ పారిజాతపూలతో అర్చిస్తుంటారు. ఇక ఆమెకి 'పెరుగు అన్నం' అంటే ఎంతో ఇష్టం కనుక దానినే నైవేద్యంగా సమర్పిస్తూ వుంటారు. 'స్కందమాత' గా అమ్మవారి అలంకరణ చూడటానికి ఈ రోజున భక్తులంతా పెద్ద సంఖ్యలో ఆలయాలకి వెళుతూ వుంటారు. బిడ్డతో పాటు దర్శనమిచ్చే ఆ తల్లిని దర్శించుకుని ధన్యులు అవుతుంటారు.

మూలరూపమైన ఆదిపరాశక్తి దుర్గతులను నశింపజేస్తూ విజయాలను ప్రసాదిస్తుంది. ఇక స్కందమాతగా అమ్మవారు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఆమె ఒడిలోని స్కందుడు సంతాన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. అందువలన ఈ రోజున అమ్మవారి దర్శన భాగ్యం వలన మనోభీష్టాలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఆ తల్లికి ఇష్టమైన పూలను ... నైవేద్యాలను సమర్పిస్తూ అమ్మవారి మనసు గెలుచుకుంటూ వుంటారు.


More Bhakti News