కూర్మావతారం

పూర్వం దేవాసురుల మధ్య వైరం కొనసాగుతోంది. రాక్షసుల బలం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో, దేవాధి దేవతలంతా ఆందోళన చెందుతూ శ్రీ మహా విష్ణువును కలుసుకున్నారు. విషయాన్ని వివరించి తరుణోపాయాన్ని సూచించవలసిందిగా కోరారు. దాంతో మంథర పర్వతాన్ని కవ్వముగా చేసుకుని ... వాసుకి సర్పమును కవ్వపు తాడుగా చేసుకుని క్షీరసాగరాన్ని మధించమని శ్రీ మహా విష్ణువు చెప్పాడు. సముద్రం నుంచి బయటపడే 'అమృతం' అన్నింటికీ పరిష్కారం చూపుతుందని అన్నాడు.

అయితే సముద్రాన్ని మధించడానికి అసురుల సహాయ సహకారాలను తీసుకోమని చెప్పాడు. సముద్ర మధన సమయంలో వాసుకి సర్పం తోక వైపున దేవతలు వుండి ... తల వైపున అసురులు ఉండేలా చూడమని అన్నాడు. ఎందుకంటే ఆ సమయంలో వాసుకి సర్పం చిమ్మే విష జ్వాలలకు అసురులు శక్తి హీనులు అవుతారని చెప్పాడు. అమృతం పంచుతామంటూ అసురులను మభ్యపెట్టి ఆ పనిని పూర్తి చేస్తే, ఆ తరువాత విషయాలు తాను చూసుకుంటానని అన్నాడు. ఇంద్రాది దేవతలంతా కూడా శ్రీ మహావిష్ణువు చెప్పింది చెప్పినట్టుగా చేశారు.

అయితే సముద్ర మధనం జరుగుతోన్న సమయంలో మంథర పర్వతం జారిపోయి సముద్రంలో మునిగిపోసాగింది. దాంతో దేవతలంతా శ్రీ మహా విష్ణువును తలచుకున్నారు. అప్పుడు ఆయన 'కూర్మావతారం' (తాబేలు రూపం) ధరించి సముద్రంలోకి ప్రవేశించాడు. సముద్రంలో మునిగిపోతున్న మంథర పర్వతమును తన వీపు పై నిలిపి, సముద్ర మధనం నిర్విఘ్నంగా జరిగేలా చేశాడు.

అందులో నుంచి వెలువడిన కాలకూట విషాన్ని శివుడు తన కంఠంలో దాచాడు. ఆ తరువాత వారుణీ దేవి ... పారిజాత వృక్షం ... కౌస్తుభమణి ... గోవులు ... అప్సరసలు ... లక్ష్మీ దేవి వెలువడిన తరువాత, 'అమృతభాండం'తో ధన్వంతరి ప్రత్యక్షమయ్యాడు. దానికోసం దేవతలతో అసురులు గొడవ పడుతుండగా, అది వారికి దక్కితే ప్రమాదమని భావించిన శ్రీ మహా విష్ణువు, 'మోహినీ'అవతారమెత్తాడు.

అలా మోహినీ రూపంలో తన సౌందర్యంతో రాక్షసులను సమ్మోహన పరుస్తూ, అమృతమును కేవలం దేవతలచే మాత్రమే తాగించాడు. అలా దేవతలను బలవంతులుగా చేసి అసురులను బలహీనులను చేయడంలో శ్రీ మహా విష్ణువు కీలకమైన పాత్ర పోషించాడు. లోక కల్యాణానికి కారణమైన ఈ ఘట్టం కోసమే ఆయన 'కూర్మావతారం' ధరించాడు.


More Bhakti News