పడవ ప్రయాణం చేసే సూర్యభగవానుడు !

వెలుగు జ్ఞానానికీ ... చైతన్యానికి ప్రతీక. అలాంటి వెలుగును సమస్త జీవరాశిపై ప్రసరింపజేసే బాధ్యతను సూర్యభగవానుడు నిర్విరామంగా నిర్వహిస్తుంటాడు. ప్రకృతిని ప్రభావితం చేస్తూ ఆ ప్రకృతి ద్వారా జీవరాసులకు అవసరమైన ఆహారాన్ని సమకూరుస్తుంటాడు. ఈ కారణంగానే ప్రాచీన కాలం నుంచి భారతీయులు ఆయనని ప్రత్యక్ష నారాయణుడిగా భావించి పూజించడం జరుగుతోంది.

ఇక క్రీస్తు పూర్వం గల నాగరికతలను పరిశీలిస్తే, వాళ్లంతా కూడా సూర్యుడిని వివిధ నామాలతో పిలిచిన ... కొలిచిన ఆనవాళ్లు కనిపిస్తాయి. తమ జీవనం సవ్యంగా సాగిపోతుంటే వాళ్లు సూర్యభగవానుడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్సవాలు నిర్వహించే వాళ్లు. ఇక ఎలాంటి అవాంతరాలు ఎదురైనా ఆయనకి ఆగ్రహం కలిగిందని భావించి తమదైన పద్ధతిలో శాంతింపజేయడానికి ప్రయత్నాలు చేసే వాళ్లు.

ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో సూర్య దేవాలయాలు దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎంతో విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. సూర్యుడిని ఆరాధించడం వలన వివిధ రకాల వ్యాధుల బారి నుంచి విముక్తి లభిస్తుందనేది ప్రాచీన గ్రంధాలలో కనిపిస్తుంది. అలాంటి సూర్యుడు ఏడుగుర్రాల రథంపై ప్రయాణిస్తూ ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి.

అయితే ఈజిప్షియన్ల పురాణాల ప్రకారం సూర్యుడు పడవమీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈజిప్షియన్లు సూర్య భగవానుడిని 'రా' అనే పేరుతో కొలుస్తుంటారు. రాత్రివేళల్లో ఆయన పడమర నుంచి తూర్పు దిశకు పడవ మీదనే ప్రయాణించి, మరునాడు తూర్పున ఉదయిస్తూ ఉంటాడని ఈజిప్షియన్లు విశ్వసిస్తుంటారు.

మన ప్రాంతాల్లో సూర్యుడు ఏడుగుర్రాల రథంపై ప్రయాణిస్తున్నట్టుగా విగ్రహాలు ... చిత్రాలు కనిపించినట్టే, అక్కడ సూర్యుడు పడవమీద ప్రయాణం చేస్తున్నట్టుగా దర్శనమిస్తూ ఉంటాడు. ఇందుకు నిదర్శనంగా గిజా పిరమిడ్ సమీపంలో 'సూర్యుడి పడవ'గా చెప్పబడే 'సోలార్ బార్క్' ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది.


More Bhakti News