నవదుర్గలకు ఇష్టమైన నైవేద్యాలు

ఆదిపరాశక్తి అయిన అమ్మవారు లోకకల్యాణం కోసం తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలను ధరించి అసుర సంహారం చేస్తూ వచ్చింది. సాధుజనుల జీవితం ప్రశాంతంగా కొనసాగడానికిగాను వారికి రక్షణగా అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించింది. అలా తమ కోసం దిగివచ్చిన ఆ తల్లి పట్ల కృతజ్ఞతా పూర్వకంగా ఈ తొమ్మిది రోజుల పాటు విశేష పూజలను అందించడం జరుగుతూ వుంటుంది.

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ గల ఈ తొమ్మిది రోజులను 'దేవీ నవరాత్రులు' గా పిలుచుకుంటూ వుంటారు. ఈ తొమ్మిది రోజులలో ఒక్కోరోజున అమ్మవారిని ఒక్కో రూపంగా అలంకరించి ... ఆ రూపాలకు ఇష్టమైన నైవేద్యాలను సంతోషంగా సమర్పిస్తుంటారు.

శరన్నవరాత్రులలో అమ్మవారిని మొదటి రోజున 'శైలపుత్రి' గా అలంకరించి ఆ తరువాత రోజుల్లో వరుస క్రమంలో 'బ్రహ్మచారిణి' .. 'చంద్రఘంట' .. 'కూష్మాండ' .. 'స్కందమాత' .. 'కాత్యాయని' .. 'కాళరాత్రి' .. 'మహాగౌరీ' .. 'సిద్ధి దాత్రి' రూపాలుగా ఆరాధిస్తూ ఉంటారు.

శైలపుత్రికి కట్టుపొంగలి ... బ్రహ్మచారిణికి పులిహోర .. చంద్రఘంటకు కొబ్బరి కలిపిన అన్నం .. కూష్మాండకు అల్లంతో చేయబడిన గారెలు .. స్కందమాతకు దధ్యోదనం .. కాత్యాయనికి కేసరీబాత్ .. కాళరాత్రికి వివిధరకాల కూరముక్కలతో కలిపి వండిన అన్నం .. మహాగౌరీకి చక్రపొంగలి .. సిద్ధిదాత్రికి పాయసం అత్యంత ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి.

అందువలన ఈ నవదుర్గలకు ఆయా నైవేద్యాలను సమర్పించవలసి వుంటుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించడమే కాకుండా, తమకి ఎంతో ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం వలన నవదుర్గలు సంతృప్తి చెందుతారు .. సకల శుభాలను ప్రసాదిస్తారు.


More Bhakti News