వెన్నంటివుంటూ కాపాడే దేవుడు

మానసిక ప్రశాంతతను అందించే నిలయాలుగా దేవాలయాలు కనిపిస్తూ వుంటాయి. ఇక ప్రాచీన దేవాలయాల విషయానికివస్తే, అక్కడ లభించే ఆనందానుభూతులు మరింత ఎక్కువగా వుంటాయి. సువిశాలమైన ప్రదేశం ... ప్రాకారాలు ... మంటపాలు చూసినప్పుడు మనసుకు ఉత్సాహం కలుగుతుంది.

మనకంటే ముందుగా ఆ ఆలయాన్ని కొంతమంది రాజులు దర్శించారనీ ... ఆలయ అభివృద్ధిలో వాళ్లు పాలుపంచుకున్నారని తెలిసినప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తుంది. అక్కడి స్వామివారి మహిమలను గురించి విన్నప్పుడు, ఏదో ఒక మహిమలో తాను ఒక పాత్ర ధారినై వుంటే బావుండునని అనిపిస్తుంది. అలాంటి అనుభూతిని అందించే ప్రాచీన దేవాలయాల జాబితాలో 'కందిబండ'లోని 'చెన్నకేశవస్వామి' ఆలయం కూడా కనిపిస్తుంది.

నల్గొండ జిల్లా కోదాడ మండలం పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది. కాకతీయుల పరిపాలనా కాలంలో వైభవంగా వెలుగొందినట్టుగా చెప్పబడుతోన్న ఈ ఆలయంలో శ్రీ భూ నీలా సమేతుడై చెన్నకేశవస్వామి దర్శనమిస్తూ వుంటాడు. రాజుల అభ్యర్థన మేరకు వాళ్లకి వీరత్వాన్నీ ... విజయాలను ప్రసాదించిన స్వామి, భక్తుల పాలిట కొంగుబంగారంగా చెప్పబడుతున్నాడు.

ఈ స్వామిని ఎవరైతే విశ్వసిస్తారో ... వాళ్లను కనిపెట్టుకుంటూ .. కాపాడుకుంటూ ఉంటాడని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. అందుకు ఎన్నో నిదర్శనాలు వున్నాయని చెబుతుంటారు. ప్రతి సంవత్సరం 'మాఘ పౌర్ణమి' రోజున స్వామివారికి ఘనంగా కల్యాణోత్సవం జరుపుతుంటారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులు, అయ్యవారినీ ... అమ్మవార్లను దర్శించుకుని తరిస్తుంటారు. కట్నకానుకలు చదివించుకుని సంతృప్తితో వెనుదిరుగుతుంటారు.


More Bhakti News