కష్టాలను తీర్చే కరుణామయుడు బాబా

సాయిబాబా శిరిడీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆ గ్రామంలోని వాళ్లే కాదు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోని వాళ్లంతా తన వాళ్లలానే భావించేవాడు. వాళ్లకి కష్టం కలిగితే తాను తల్లడిల్లిపోయేవాడు. ఆ బాధనుంచి వాళ్లను బయటపడేసేంతవరకూ మనశ్శాంతిగా ఉండేవాడు కాదు.

తనని నమ్మిన భక్తులు ఎవరు ఎక్కడికి వెళుతున్నా ... వస్తున్నా ... ఎలాంటి శుభకార్యాలు తలపెడుతున్నా బాబా ఒక కంట గమనిస్తూనే ఉండేవాడు. వాళ్ల నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవని అనిపిస్తే వెంటనే మందలించేవాడు. వాళ్లకి శుభాన్ని కలిగించే మార్గాన్ని సూచించేవాడు. అందుకే అక్కడి ప్రజలంతా బాబా వున్నాడనే భరోసాతో బతికేవాళ్లు.

అలాంటి బాబా సమాధి చెంది చాలాకాలమవుతున్నా తనని విశ్వసించిన వాళ్లకు ఆయన అదే భరోసాను ఇస్తూ వుండటం విశేషం. ఈ కారణంగానే అనేక ప్రాంతాలలో బాబా ఆలయాలు అలరారుతున్నాయి ... ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. అలాంటి విశిష్టమైన ఆలయాలో ఒకటి ఖమ్మం - గాంధీచౌక్ లో దర్శనమిస్తుంది.

సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రశాంతతకు ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది. ఇక్కడి బాబా విగ్రహం అచ్చు శిరిడీలోని బాబా మూర్తిని పోలివుండటం విశేషమని చెబుతుంటారు. శిరిడీలో మాదిరిగానే ఇక్కడ బాబాకి అన్ని రకాల సేవలను నిర్వహిస్తుంటారు. హారతులు ... భజనలు ... పారాయణాలు చేసే వాళ్లతో ఆలయం సందడిగా కనిపిస్తూ వుంటుంది.

బాబాకి నమస్కరిస్తూ ఆయన ఎదురుగా నుంచుంటే, చూపులతోనే ఆయన అనారోగ్యాలను ... మానసిక అశాంతిని తీసేస్తున్న భావన కలుగుతూ వుంటుంది. ఇక్కడి బాబా అనుగ్రహంతో ఉన్నతమైన స్థితికి చేరుకున్న వాళ్లు ఎంతోమంది వున్నారని చెబుతుంటారు. అంకితభావంతో భక్తులు కోరుకున్న దానిని బట్టి, ఆరోగ్యాన్నీ ... ఐశ్వర్యాన్ని ... విజయాలను అందిస్తూ ఉంటాడని అంటారు.

బాబాను దర్శించుకున్న వాళ్లు తీర్థ ప్రసాదాలతో పాటు ఆయన అనుగ్రహాన్ని కూడా తప్పక తీసుకు వెళుతూ ఉంటారనే విశ్వాసం ఇక్కడ బలంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.


More Bhakti News