ఇక్కడ మొక్కుబడి ఈ విధంగా చెల్లిస్తారు !

పూర్వం రాజులు తమ అంతఃపురంలో జరిగే వివిధ వేడుకల సందర్భంలో కూడా పేద ప్రజలను మరిచిపోయే వాళ్లు కాదు. ఈ వేడుకలు జరుపుకునే రోజున దానధర్మాలు ఎక్కువగా చేసేవారు. ముఖ్యంగా పుట్టినరోజు సందర్భంగా తమ బరువుకి తగిన ధనంతో 'తులాభారం' తూగి, ఆ సంపదను పేద ప్రజలకు పంచుతూ వుండేవారు.

అలాగే ఆ రోజున తమకి నచ్చిన క్షేత్రానికి వెళ్లి అక్కడ తమ బరువుకి సమానమైన బరువు గల ధనంతో తులాభారం తూగి, ఆ సంపదను స్వామివారికి సమర్పించేవారు. అప్పటి నుంచి 'తులాభారం' ద్వారా స్వామికి మొక్కుబడులు చెల్లించే పద్ధతి మొదలైనట్టుగా కనిపిస్తూ వుంటుంది.

కొన్ని క్షేత్రాల్లో ఈ తులాభారం పద్ధతి కనిపిస్తున్నా, గురువాయూర్ క్షేత్రం విషయానికి వచ్చేసరికి ఇక్కడ 'తులాభారం' మొక్కు ప్రధానమైనదిగా కనిపిస్తూ వుంటుంది. ఆపదల్లోను ... అవసరల్లోను భక్తులు ఇక్కడి స్వామికి తులాభారం తూగి మొక్కు చెల్లించుకుంటామని చెప్పుకుంటూ వుంటారు.తిరుమలలో మొక్కుగా తలనీలాలు సమర్పించే భక్తులు ఎక్కువగా కనిపిస్తుంటారు. అలాగే ఇక్కడ 'తులాభారం' మొక్కు తీర్చుకునే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది.

గురువాయురప్ప అనుగ్రహంతో కష్టాల నుంచి గట్టెక్కిన తరువాత, తమ బరువుకి సమానంగా అరటిపండ్లు .. బెల్లం ... పటికబెల్లం ... కొబ్బరికాయలను వుంచి వాటిని మొక్కుగా చెల్లిస్తుంటారు. ఆ స్వామికి ఇష్టమైన వీటిని'తులాభారం' ద్వారా సమర్పిస్తామని అనుకుంటే, ఎలాంటి కష్టం నుంచైనా ఆయన కాపాడతాడని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News