తుమ్మిపూలతో పూజా ఫలితం !

అంకితభావంతో ఆదిదేవుడిని పూజించాలేగాని అడిగిన వరాలను ఆయన ఆలస్యం చేయకుండా అనుగ్రహిస్తుంటాడు. ఈ కారణంగానే దేవతల నుంచి సాధారణ మానవుల వరకూ అనునిత్యం ఆయనని దర్శిస్తూ వుంటారు ... పూజాభిషేకాలతో సేవిస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో పరమశివుడి మనసు మరింతగా గెలుచుకునే రోజుగా 'మహాశివరాత్రి' కనిపిస్తూ వుంటుంది.

ఈ రోజున ముక్కంటిని వివిధ రకాల పూలతో పూజిస్తూ వుంటారు. ఈ జాబితాలో మల్లెపూలు ... గన్నేరు పూలు .. నువ్వుపూలు .. కలువ పూలు .. జాజిపూలు .. తుమ్మి పూలు మొదలైనవి కనిపిస్తుంటాయి. శివరాత్రి రోజున ఒక్కోరకమైన పూలతో ఆ స్వామిని పూజించడం వలన ఒక్కో విశేష ఫలితం కలుగుతుందని చెప్పబడుతోంది.

ఈ రోజున ఆ సదాశివుడిని కొన్నిరకాల పూలతో పూజించడం వలన ఐశ్వర్యం ... ఆరోగ్యం ... విజయం కలుగుతూ వుంటాయి. మరి మోక్షాన్ని పొందడానికి ఆ స్వామిని ఏ పూలతో అర్చించాలనే సందేహం కొంతమందికి కలుగుతుంటుంది. 'తుమ్మిపూల'తో శివుడిని పూజించడం వలన మోక్షం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన మోక్షాన్ని కోరుకునేవాళ్లు ఆదిదేవుడిని తుమ్మిపూలతో అర్చించవలసి వుంటుంది ... మహాదేవుడి మనసు గెలుచుకోవలసి వుంటుంది.


More Bhakti News