రాముడు రంగడు కొలువైన క్షేత్రం

రాజులు ... సామంతులు ... సంస్థానాధీశులు ... జమీందారులు వీరంతా కూడా తమ పరిధిలో ఆలయాలను నిర్మించి భగవంతుడి పట్ల తమకి గల భక్తి శ్రద్ధలను నిరూపించుకున్నారు. ఆ రోజులలో వాళ్లు నిర్మించిన ఆలయాలు నేడు పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. అనేక విశేషాలను కలిగినవిగా విలసిల్లుతున్నాయి.

అలాంటి క్షేత్రాల్లో ఒకటి 'సిరిపురం'లో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా నడిగూడెం మండలం పరిధిలో ఈ క్షేత్రం దర్శనమిస్తూ వుంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం 'రాజ బహద్దూర్' వెంకటరమణారెడ్డి ఏలుబడిలో ఉండేది. అప్పుడు ఆయన శ్రీదేవి - భూదేవి సమేత రంగనాయక స్వామిని ఆలయాన్ని ఇక్కడ నిర్మించాడు. అలాగే కోదండ రామాలయం కూడా నిర్మించాడు. స్వామివారి ధూప దీప నైవేద్యాల నిమిత్తం ఆయన పెద్దమొత్తంలో భూమిని ఇవ్వడం జరిగిందట.

దాదాపు మూడు ఎకరాల పైన విస్తీర్ణం కలిగిన ఈ ప్రదేశంలో ఈ జంట దేవాలయాలు దర్శనమిస్తూ వుంటాయి. భారీతనాన్ని సంతరించుకున్న ఈ ఆలయాలు భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ వుంటాయి. శ్రీరామనవమి రోజున నిర్వహించే సీతారాముల కల్యాణానికీ, మాఘశుద్ధ పౌర్ణమికి జరిగే రంగనాయకస్వామి కల్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. కోదండ రాముడినీ ... రంగానయకుడిని దర్శించుకుని తరిస్తుంటారు.


More Bhakti News