సకల శుభాలనొసగే సదాశివుడు

అడిగిన వెంటనే వరాలను అందించడంలో ఆదిదేవుడు ముందుంటాడు. సంకల్ప సిద్ధి కోసం ఎంతోమంది దేవతలు ... మహర్షులు ... మహారాజులు ఆ స్వామిని ఆరాధించారు. ఆయా ప్రాంతాలలో శివాలయాలను నిర్మించి ... నిత్యం సేవించారు. ఈ కారణంగానే అనేక ప్రాంతాల్లో శివాలయాలు కనిపిస్తూ వుంటాయి. ఒక్కో క్షేత్రం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని భక్తులకు దర్శనమిస్తున్నాయి.

అలాంటి ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి ఖమ్మం జిల్లా 'నేలకొండపల్లి' లో కనిపిస్తోంది. భక్త రామదాసు జన్మస్థలంగా ... ఆయన కీర్తనలతో పరవశించిన పుణ్యస్థలిగా నేలకొండపల్లి ప్రసిద్ధి చెందింది. ఇక్కడే ప్రాచీనకాలం నాటి శివాలయం భక్తులకు దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడి స్వామిని 'ఉత్తరేశ్వరుడు' గా కొలుస్తుంటారు. స్వామిని ఈ పేరుతో పిలుచుకోవడం వెనుక కారణం వుంది.

పాండవులు తమ అజ్ఞాతవాస కాలంలో విరాటరాజు కొలువులో చేరతారు. మారువేషాల్లోనూ ... మారు పేర్లతోను వాళ్లు అక్కడ గడుపుతారు. ఈ సందర్భంలోనే విరాటరాజు కొడుకైన ఉత్తర కుమారుడి ప్రస్తావన వస్తుంది. ఆ ఉత్తర కుమారుడే ఇక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది. ఉత్తర కుమారుడు ప్రతిష్ఠించిన కారణంగా ఇక్కడి స్వామి 'ఉత్తరేశ్వరుడు పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు.

ఈ స్వామిని సేవించడం వలన సకల శుభాలు కలుగుతాయని స్థానికులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. ఈ గ్రామానికి వెళ్లడం వలన మహాభారత కాలంతో ముడిపడిన శివాలయాన్ని దర్శించడమే కాకుండా, మహాభక్తుడైన రామదాసు నివసించిన ఇంటిని కూడా చూసే మహద్భాగ్యం కలుగుతుంది.


More Bhakti News