పరివర్తన ఏకాదశి రోజున ఏం చేయాలి ?

శ్రీమన్నారాయణుడు భక్తవత్సలుడు ... తనని నమ్మిన భక్తులను కాపాడటం తన ప్రధమ కర్తవ్యం అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తూ వుంటాడు. లోక కల్యాణం కోసం అనేక అవతారాలను ధరించడం ... తన భక్తులకు ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది.

అలాంటి శ్రీమన్నారాయణుడిని 'ఏకాదశి' రోజున పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే 'పరివర్తన ఏకాదశి' అనే పేరు కూడా వినిపిస్తూ వుంటుంది. పరివర్తన ఏకాదశి అంటే ఏమిటి ? ... దాని ప్రత్యేకత ఏమిటి ? అనే సందేహం కొంతమందికి కలుగుతూ ఉంటుంది.

'భాద్రపద శుద్ధ ఏకాదశి' ని ... 'పరివర్తన ఏకాదశి' గా పిలుస్తుంటారు. తొలి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శేష శయ్యపై యోగ నిద్రలోకి జారుకున్న శ్రీమహావిష్ణువు, ఈ రోజున ఒక వైపు నుంచి మరో వైపుకి ఒత్తిగిల్లుతాడట. ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు శయన భంగిమలో ఒకవైపు నుంచి మరోవైపుకి తిరుగుతాడు కనుక, దీనిని పరివర్తన ఏకాదశిగా పిలుస్తుంటారు.

ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ... ఉపవాస దీక్షను చేపట్టి ... జాగరణకి సిద్ధపడి శ్రీమహావిష్ణువును పూజించవలసి వుంటుంది. ''ఓం వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ ... పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ'' అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని పూజించడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని చెప్పబడుతోంది.


More Bhakti News