గణపతిని నలుగుపిండితో చేసిందిక్కడే !

వినాయక చవితి వ్రత కథలో ... గణపతి ఆవిర్భవించే తీరును గురించి చెప్పడం జరుగుతుంది. పార్వతీదేవి నలుగుపిండితో వినాయకుడి బొమ్మను తయారుచేసి ... దానికి ప్రాణంపోసే ఘట్టం అందరికీ అత్యంత ఆసక్తిని కలిగిస్తూ వుంటుంది. అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగి ఉంటుందనే సందేహం కూడా చాలామందికి కలుగుతుంటుంది.

లోక కల్యాణానికి కారణమైన ఈ అపురూప ఘట్టం 'లేన్యాద్రి'లో జరిగినట్టు స్థలపురాణం చెబుతోంది. పూణే సమీపంలో గల 'గోలే గావ్' అనే పర్వత ప్రాంతంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. సింధురాసురుడు అనే రాక్షసుడిని పార్వతీదేవి తనయుడిగా సంహరిస్తానని దేవతలకు వినాయకుడు మాట ఇస్తాడు. అప్పటికే పుష్కర కాలంగా వినాయకుడిని తన పుత్రుడిగా పొందడానికి పార్వతీదేవి తపస్సు చేస్తూ వుంటుంది.

ఒక రోజున అంటే 'భాద్రపద శుద్ధ చవితి' రోజున ఆమె నలుగుపిండితో వినాయకుడి బొమ్మను చేసి ప్రాణం పోస్తుంది. అలా పార్వతీదేవి తనయుడిగా వినాయకుడు ఆవిర్భవిస్తాడు. అందుకే ఇక్కడి వినాయకుడు నలుగుపిండితో చేయబడినట్టుగానే కనిపిస్తూ, గిరిజాత్మజుడు ( పార్వతీ కుమారుడు)గా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు.

వినాయడుని పుత్రుడిగా పొందడం కోసం అమ్మవారు తపస్సు చేసిందీ ... నలుగుపిండితో ఆయన బొమ్మను చేసి ప్రాణం పోసింది 'లేన్యాద్రి' పైనే కావడం వలన ఈ క్షేత్రం అత్యంత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది. అశేష భక్త జనులచే పూజించబడుతూ అష్టగణపతి క్షేత్రాల్లో తన ప్రత్యేకతను చాటుతూ వుంటుంది.


More Bhakti News