చర్మ వ్యాధులను నివారించే క్షేత్రం

కొన్ని ప్రాచీన క్షేత్రాలు మారుమూల ప్రాంతాల్లోనూ ... అడవీ ప్రాంతాల్లోను ఉండటం వలన వాటికి తగినంత ప్రచారం లభించకపోవడం జరుగుతుంది. అందువలన ఆ క్షేత్రాలకి సంబంధించిన స్థలమహాత్మ్యం ... చారిత్రక నేపథ్యం దూరప్రాంతాలవారికి తెలియకుండా పోతుంది. అలాంటి క్షేత్రాల్లో 'అడవిదేవుల పల్లి' ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది.

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పరిధిలో ఈ క్షేత్రం కనిపిస్తూ వుంటుంది. ఒకప్పుడు దట్టమైన అడవీ ప్రాంతంగా చెప్పబడుతోన్న ఈ ప్రదేశానికి ఎంతో చారిత్రక నేపథ్యం వుంది. ఇక్ష్వాకులు ... విష్ణుకుండినులు ... కల్యాణి చాళుక్యుల పరిపాలనా కాలంలో ఈ ఆలయాలకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది.

చెన్నకేశవుడు ... శివుడు .. గణపతి .. సుబ్రహ్మణ్యస్వామి ... హనుమంతుడు కొలువైన ఈ ప్రాచీన క్షేత్రంలో 'సూర్యనారాయణమూర్తి' మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తూ వుంటాడు. శిల్పకళా శోభితమైన ఈ ఆలయంలో సూర్యభగవానుడు దివ్యమైన తేజస్సుతో కనిపిస్తూ ఉంటాడు. కోణార్క్ సూర్యనారాయణుడు ... అరసవిల్లి సూర్యనారయణుడి తరువాత స్థానం ఇక్కడి సూర్యభగవానుడిదేనని చెబుతుంటారు.

ఎందుకంటే ఈ స్వామిని దర్శించుకున్నవారికి చర్మ సంబంధిత వ్యాధులు పూర్తిగా నివారించబడతాయట. చర్మ సంబంధమైన వ్యాధులతో బాధలు పడేవాళ్లు ఇక్కడి స్వామి పాదాలను ఆశ్రయించడం వలన మంచి ఫలితం కనిపిస్తుందని భక్తులు బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతిని సొంతం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పక దర్శించి తీరవలసిన క్షేత్రం ఇది.


More Bhakti News