అపకారికి ఉపకారం ఎవరు చేస్తారు ?

ఎవరైనా ద్రోహం తలపెట్టినప్పుడు ... తిరిగి వాళ్లపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూసేవాళ్లే లోకంలో ఎక్కువగా కనిపిస్తుంటారు. అపకారం చేసిన వారిని పెద్ద మనసుతో మన్నించి వాళ్లకి ఉపకారం చేసే వాళ్లు అరుదుగా వుంటారు. ప్రతి జీవిలోనూ భగవంతుడిని దర్శించేవారు ... మానవసేవయే మాధవసేవగా భావించేవారు మాత్రమే అంతటి పరిపక్వతను ప్రదర్శించగలుగుతారు.

ఆలాంటి మహనీయులలో ... మహాభక్తులలో తుకారామ్ ఒకడుగా కనిపిస్తాడు. పాండురంగస్వామి భక్తులలో తుకారామ్ ముందువరుసలో కనిపిస్తాడు. ఆయన రాసిన అభంగాలు అనూహ్యమైన స్థాయిలో ఆదరణ పొందుతూ వుంటాయి. జనమంతా ఆయన పాదముద్రలను కనులకు అద్దుకోవడమే భాగ్యంగా భావిస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది తుకారామ్ కి వ్యతిరేక వర్గంగా మారతారు.

జనం హృదయాల్లో ఆయన సంపాదించుకున్న స్థానాన్ని చెరిపివేయడానికి వాళ్లు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. వాళ్లు చేసిన ప్రతి పని వలన తుకారామ్ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయే గాని తరగవు. అంతే కాకుండా తుకారామ్ వంటి భక్తుడికి కీడు తలపెట్టినందుకు గాను వాళ్ల కాళ్లు .. చేతులు పడిపోతాయి. ఇతరులపై ఆధారపడి బతకవలసిన పరిస్థితి వస్తుంది. దాంతో వాళ్లు తుకారామ్ ని అతికష్టంపై కలుసుకుని, తమని క్షమించమని కోరుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు.

అప్పటి వరకూ వాళ్లు చేసిన అపకారాలను గురించి మాట్లాడకుండా, వాళ్లని క్షమించమని తన మాటగా ఆయన భగవంతుడిని కోరతాడు. అంతే ఆ క్షణమే వాళ్ల కాళ్లు ... చేతులు పనిచేయడం ఆరంభిస్తాయి. భగవంతుడిని ప్రేమించే వాళ్లు అందరినీ ప్రేమిస్తారనీ, అలాంటి వాళ్లు అపకారులకు కూడా ఉపకారం చేస్తారని తుకారామ్ మరోమారు నిరూపించాడు.


More Bhakti News