పుణ్యఫలాలనిచ్చే భాద్రపద శుద్ధ షష్ఠి

'చేసుకున్నవారికి చేసుకున్నంత' అనే నానుడి తరచూ వింటూవుంటాం. అంటే పాపం చేసుకున్నా ... పుణ్యం చేసుకున్నా దాని ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుందనే విషయం స్పష్టమవుతూ వుంటుంది. మరి తెలిసో ... తెలియకో కొన్ని పాపాలను చేసి వుంటాం ... వాటి బారి నుంచి బయటపడే మార్గం లేదా ? అని చాలామంది ఆవేదనకి లోనవుతూ వుంటారు.

అందుకోసమే ఎన్నో పూజలు ... నోములు .. వ్రతాలు చెప్పబడ్డాయి. అలాంటి పుణ్య విశేషాన్ని సంతరించుకున్న రోజుగా 'భాద్రపద శుద్ధ షష్ఠి' కనిపిస్తూ వుంటుంది. 'సూర్య షష్ఠి'గా పిలవబడుతోన్న ఈ రోజున అంతా సూర్య భగవానుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడిగా భావించి ఆయనని ఆరాధించడమనేది ప్రాచీనకాలం నుంచి ఉంది.

అనునిత్యం సూర్యుడికి నమస్కరించడం వలన అనేక పుణ్యఫల విశేషాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాంటి సూర్యభగవానుడిని .. భాద్రపద శుద్ధ షష్ఠి రోజున నదీ స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి అంకితభావంతో పూజించాలని శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా చేయడం వలన పాపాల రాశి తగ్గుముఖంపడుతూ ... పుణ్యరాశి పెరుగుతుందని చెప్పబడుతోంది. అంతేకాదు ... ఇక ఈ షష్ఠి రోజున కుమారస్వామిని పూజించడం వలన కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.

సాధారణంగానే కుమారస్వామి వివిధ దోషాలను ... వాటి ఫలితంగా అనుభవించే దుఃఖాలను దూరం చేస్తుంటాడు. అలాంటిది విశేషమైనటు వంటి ఈ పుణ్యతిథిన కుమారస్వామిని ఆరాధించడం వలన పాపాలు నశించి ... సకల శుభాలు కలుగుతాయని స్పష్టం చేయబడుతోంది. అటు సూర్య భగవానుడి అనుగ్రహాన్నీ ... ఇటు కుమారస్వామి కరుణా కటాక్షాలను అందించే రోజుగా భాద్రపద శుద్ధ షష్ఠి తన ప్రత్యేకతను చాటుకుంటూ వుంటుంది.


More Bhakti News