గుహకి మార్గం చెప్పిన నరసింహస్వామి

ప్రాచీనమైన నరసింహస్వామి క్షేత్రాలలో 'రేపాల' నరసింహస్వామికి ఎంతో ప్రత్యేకత వుంది. నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం పరిధిలో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని గురించి తెలుసుకోవాలంటే కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్లవలసి ఉంటుంది.

'నడిగూడెం' గ్రామానికి చెందిన ఓ జమీందారుకి ఒక కల వచ్చిందట. ఆ కలలో ఆయనకి నరసింహస్వామి కనిపించి .. తాను ఫలానా కొండపై గల గుహలో ఆవిర్భవించినట్టు చెబుతాడు. ఆ గుహకు చేరుకోవడానికి మార్గాన్ని చెప్పడమే కాకుండా, అక్కడ తనని భక్తులు దర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు. ఆ జమీందారు మరునాడు ఉదయాన్నే ఊళ్లో వాళ్లకి ఈ విషయాన్ని గురించి చెబుతాడు.

గుహ మార్గాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ముందుగా నడుస్తుంటే గ్రామస్తులు ఆయనని అనుసరిస్తారు. అలా వాళ్లు 'రేపాల'లో గల కొండపైకి చేరుకుంటారు. ఆ సమయంలోనే అక్కడి గుహలో నుంచి కాంతిపుంజాలు బయటికి వస్తుండగా, వాటి సాయంతో అంతా లోపలికి ప్రవేశిస్తారు. గుహ లోపల ఆదిలక్ష్మి - చెంచులక్ష్మి సమేతంగా వెలసిన నరసింహస్వామిని చూసి అంతా సంతోషంతో పొంగిపోతారు. స్వామిని అలంకరించి .. కొబ్బరికాయలు కొట్టి ... హారతి పడతారు. అలా ఇక్కడి స్వామివారు వెలుగులోకి రావడం జరిగింది.

సాధారణంగా నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై మాత్రమే దర్శనమిస్తూ వుంటాడు. అలాంటిది ఇక్కడి స్వామి చెంచులక్ష్మితో కూడా కొలువై ఉండటం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతగా చెబుతుంటారు. నడిగూడెం జమీందారే ఇక్కడి స్వామి సేవలకు సంబంధించి శాశ్వత ఏర్పాట్లను చేసినట్టు స్థలపురాణం చెబుతోంది. మహిమగల ఈ క్షేత్రాన్ని దర్శించి ... స్వామివారిని అంకితభావంతో ఆరాధిస్తే అనారోగ్యాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News