భక్తులను రక్షించే నారసింహుడు

సాధారణంగా లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాలు గుట్టలపై ... కొండలపై కనిపిస్తుంటాయి. ఇక స్వామివారు స్వయంభువు మూర్తిగానే ఎక్కువగా ఆవిర్భవిస్తూ వుంటాడు. అందువలన ఆయన కొలువైనవి అత్యంత శక్తిమంతమైన క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. ఆయన క్షేత్రల్లోకి అడుగుపెడుతూ ఉండగానే దుష్టశక్తులు ... దుష్ట ప్రయోగాలు వదిలి దూరంగా పారిపోతుంటాయి.

అలాంటి విశిష్టమైన క్షేత్రాలలో 'ఇసునూరు' ఒకటిగా చెబుతుంటారు. వరంగల్ జిల్లా 'చేర్యాల' మండలం పరిధిలో ఈ క్షేత్రం అలరారుతూ వుంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శించినవారికి 'మంగళగిరి' లక్ష్మీనరసింహస్వామి గుర్తుకువస్తాడు. ఎందుకంటే ఆయనలానే ఈయనకి కూడా పానకమంటే ఎంతో ఇష్టమని చెబుతుంటారు. భక్తులు తనపట్ల ప్రేమానురాగాలతో తీసుకువచ్చిన పానకాన్ని స్వామివారు కొంత స్వీకరించి మరికొంత వదిలేస్తుంటాడు.

తమ మనసులోని మాటను స్వామివారికి చెప్పుకుని పానకాన్ని అందించేవాళ్లు కొందరైతే ... స్వామివారు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పానకాన్ని సమర్పించేవాళ్లు మరికొందరు. స్వామివారి కోసం ఎంత పానకాన్ని తీసుకువచ్చినా అందులో కొంతభాగాన్ని వదిలివేయడమే ఇక్కడి మహిమగా చెబుతుంటారు. ఇక్కడి స్వామిని అంకితభావంతో ఆరాధిస్తూ ఉండాలే గాని, ఆయన వెన్నంటివుంటూ రక్షిస్తూ ఉంటాడని భక్తులు చెబుతుంటారు.


More Bhakti News