అడవిలో కొలువైన దేవుళ్లు

ఒకప్పుడు అది దట్టమైన అడవీ ప్రాంతం ... ఆ అడవిలో చెన్నకేశవస్వామి ... ఈశ్వరుడు ... సూర్యభగవానుడు ... గణపతి ... సుబ్రహ్మణ్యస్వామి ... హనుమంతుడు ... కొలువుదీరి కనిపిస్తుంటారు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి అడవిదేవుళ్లపల్లి అనే పేరు వచ్చింది. కాలక్రమంలో అది 'అడవిదేవులపల్లి'గా ప్రసిద్ధి చెందింది.

ఈ ప్రదేశంలో ఇంతటి అందమైన దేవాలయాలు ఉన్నాయా ? అని ఆశ్చర్యాన్ని కలిగించేలా ఈ ప్రాచీన క్షేత్రం నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో దర్శనమిస్తూ వుంటుంది. ప్రధాన దైవాలుగా చెన్నకేశవుడు ... ఈశ్వరుడు అలరారుతోన్న కారణంగా ఈ క్షేత్రాన్ని చెన్నకేశ్వర క్షేత్రంగా పిలుస్తుంటారు. ఇక్ష్వాకులు ... విష్ణుకుండినీలు ... కల్యాణీ చాళుక్యులు ... ఈ క్షేత్రం అభివృద్ధికి తమవంతు కృషి చేసినట్టుగా స్థలపురాణం చెబుతోంది.

ఆయా మ్యూజియాలలో ఈ రాజుల కాలం నాటి శాసనాలు ఉన్నాయట. తమ రాజ్యంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండటం కోసం ... తమకి విజయాలను చేకూర్చడం కోసం ఆనాటి రాజులు ఈ ఆలయాలను నిర్మించినట్టు ఆధారాలు చెబుతున్నాయి. కోణార్క్ సూర్య దేవాలయం ... అరసవిల్లి సూర్యదేవాలయం తరువాత స్థానం ఇక్కడి సూర్యనారణమూర్తి ఆలయానికి దక్కుతుందని చెబుతుంటారు.

ఇక్కడి సూర్యదేవుడి తేజస్సు ... శిల్పకళా వైభవంతో ఉట్టిపడే ఆలయ నిర్మాణం ఆనందాశ్చర్యాలను కలిగిస్తుంది. ఈ స్వామిని దర్శించడం వలన వివిధ రకాల చర్మవ్యాధులు నశిస్తాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నట్టుగా కనిపించే ఈ ఆలయాల సముదాయాన్ని దర్శించడం వలన ఆహ్లాదం కలుగుతుంది ... సంతోషంతో కూడిన సంతృప్తి మిగులుతుంది.


More Bhakti News