చల్లగా చూసే చక్కని దేవుడు

వేంకటేశ్వరస్వామి దివ్యమంగళ రూపం చూసి పరవశించిపోని భక్తులు వుండరు. సమ్మోహనకరమైన ఆయన రూపాన్నిచూసి కష్టాలు మరిచిపోయేవాళ్లు కొందరైతే, కారణం తెలియకుండానే కన్నీళ్ల పర్యంతమయ్యేవాళ్లు మరికొందరు.

కేవలం దర్శనమాత్రం చేతనే ఆనందాన్ని ... అభయాన్ని ఇచ్చే వేంకటేశ్వర నామం కోట్లాది గుండెల్లో మధురమైన మంత్రమై మోగుతుంటుంది. ప్రతి ఇంట్లోను చిరునవ్వులు చిందిస్తూ వుండే ఆయన చిత్రపటం కనిపిస్తూ వుంటుంది. ఆపద మొక్కులవాడిగా ఆకట్టుకున్న ఆ స్వామిని అనునిత్యం దర్శించుకోవాలనే సంకల్పం కారణంగా అనేక ప్రదేశాలలో ఆయన ఆలయాలు నిర్మించబడ్డాయి.

అలాంటి ఆలయాలలో ఒకటి హైదరాబాద్ .. సాగర్ రోడ్ లోని హస్తీనాపురం సౌత్ కాలనీలో కనిపిస్తుంది. కుదురైన నిర్మాణంగా కనిపించే ఈ ఆలయం పవిత్రతకు ప్రతీకగా అనిపిస్తూ వుంటుంది. ఇక్కడి స్వామివారు శ్రీదేవి - భూదేవి సమేతుడై భక్తులకు దర్శనమిస్తూ వుంటాడు. గర్భాలయంలో స్వామివారు నిండుగా కొలువైవుండగా, ప్రత్యేక మందిరాల్లో అమ్మవార్లు దర్శనమిస్తూ వుంటారు.

ప్రతి శనివారం రోజున ... పర్వదినాల్లోను భక్తులు స్వామివారిని పెద్ద సంఖ్యలో దర్శించుకుంటూ వుంటారు. ధనుర్మాసమంతా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే సమస్యలు తొలగిపోయి సంతోషకరమైన జీవితం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.

ఇదే ప్రాంగణంలో గణపతి ఆలయం కూడా దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడి స్వామిని దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందనే విశ్వాసం బలంగా కనిపిస్తూ వుంటుంది. అందువలన అనునిత్యం ఆ స్వామిని దర్శించుకున్న తరువాతనే తమ దైనందిన కార్యక్రమాలను ఆరంభిస్తుంటారు. అలా వినాయక స్వామి ఆశీస్సులతో కార్యసిద్ధినీ, వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో సకల శుభాలను కలిగిస్తూ ఈ ఆలయం తన విశిష్టతను చాటుకుంటోంది.


More Bhakti News