శ్రీ జోగులాంబా దేవి

'శ్రీ జోగులాంబాదేవి' శక్తి పీఠం శ్రీశైలానికి పశ్చిమ దిశగా విరాజిల్లుతోన్న'అలంపురం'లో అవతరించింది. సతీదేవి దేహానికి సంబంధించిన 'పై దంత పంక్తి' ఈ ప్రాంతంలో పడినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ అలంపురం ... హలంపురం ... హేమలాపురం ... అనంపురం వంటి పూర్వ నామాలను కలిగివుంది. ఇక్కడి మూలమూర్తి చూడగానే భయం గొలిపేలా ఉగ్ర రూపంలో వుంటుంది. అందువలన తాంత్రిక స్వాములు ఎక్కువగా ఈ అమ్మవారిని కొలుస్తుంటారు.

ఇక ఇక్కడి ఆలయ నిర్మాణ విశేషాలను గురించిన కథ ఒకటి పురాణాలలో కనిపిస్తోంది. పూర్వం కాశీ పట్టణంలో పుణ్యవతి అనే శివ భక్తురాలు విధివశాత్తు వితంతువుగా మారుతుంది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఒకసారి తన హృదయంలో ఆమెకి భర్తను చూపిస్తాడు. ఆనందపరవశురాలైన ఆమె తనకి ఓ మగబిడ్డను ప్రసాదించమని పరమేశ్వరుడిని వేడుకుంటుంది. శివుడి అనుగ్రహంతో ఓ బిడ్డకి తల్లైన ఆమె, సమాజం దృష్టిలో అవమానం పాలవుతుంది.

ఊహ తెలిసిన తరువాత తన తండ్రి ఎవరో చెప్పమంటూ కొడుకు కూడా నిలదీయడంతో, అతని జన్మ కారకుడు శివుడేనని ఆ తల్లి సమాధానమిస్తుంది. దాంతో శివుడి కోసం ఆ పిల్లవాడు కఠోర తప్పస్సు చేయగా ఆయన ప్రత్యక్షమై అతని సందేహాన్ని నివృత్తి చేస్తాడు. ఆ బాలకుడు కారణ జన్ముడనే విషయాన్ని బయట పెడుతూ, ఓ మహత్కార్యాన్ని పూర్తి చేయవలసిన బాధ్యతను అతనికి అప్పగిస్తాడు. దక్షిణ కాశీ అయినటువంటి అలంపురం శక్తి పీఠమనీ, వేదవతి - తుంగభద్ర నదుల సమీపంలో అక్కడి దేవతలకు దేవాలయములను నిర్మించమని ఆ బాలకుడికి చెబుతాడు.

శివుడి అనుగ్రహంతో రససిద్ధిని పొందిన ఆ బాలకుడు అలంపురం చేరుకొని, అక్కడ దేవాలయముల నిర్మాణాన్ని చేపడతాడు. ఇందుకు అడ్డుపడిన రాజు శాపగ్రస్తుడై రాజ్యం పోగొట్టుకుని బికారిగా మారతాడు. ఆ తరువాత ఆలయ నిర్మాణాలలో ఆ బాలకుడికి సాయపడుతూ, తిరిగి పూర్వ వైభవాన్ని పొందుతాడు. ఈ శక్తి పీఠంలో ఒకసారి స్నానం చేస్తే గంగానదిలో ఏడాదిపాటు స్నానం చేసిన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.


More Bhakti News