శ్రీ చాముండేశ్వరీ దేవి

'శ్రీ చాముండేశ్వరీ దేవి' శక్తి పీఠం మనకి కర్ణాటకలోని మైసూర్ నందు కనిపిస్తుంది. అమ్మవారి 'కుచము' పడిన ప్రదేశం కనుక ఈ ప్రాంతానికి 'క్రౌంచ పట్టణం' అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ఇది మహిషాసురుడి ఏలుబడిలోకి రావడంతో, ఈ ప్రాంతాన్ని అంతా 'మహిషపురం' అని పిలిచేవారు. అలా కాలప్రవాహంలో ఇది 'మైసూరు' అయిందని చరిత్ర చెబుతోంది.

ఇంద్ర పదవిని పొందిన మహిషాసురిడి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. మహిషాసురుడి ఆగడాలకు అడ్డుకట్ట వేయమని దేవతలంతా త్రిమూర్తులతో మొరపెట్టుకున్నారు. అప్పుడు వారి ముఖాలలో నుంచి వెలువడిన ఒక దివ్యమైన తేజస్సుతో ఒక దేవీ అవతరించింది. దేవతలు అందించిన ఆయుధాలు తీసుకుని ఆమె సింహంపై మహిషాసురుడి పై యుద్ధానికి బయల్దేరింది. వేలాది సైన్యంతో మహిషాసురుడు ఆ శక్తిని ఎదుర్కోవడానికి ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.

ఒక ప్రళయంలా ఆ శక్తి స్వరూపం మహిషాసురుడి పై విరుచుకుపడి వాడిని సంహరించింది. ఆ తరువాత దేవతల కోరిక మేరకు ఆమె అక్కడే 'చాముండేశ్వరీ దేవిగా' వెలసింది. ఇక్కడి అమ్మవారిని పూజించడం వలన, ఆశించిన రంగంలో విజయం చేకూరుతుందని అంటారు.


More Bhakti News