అందుకే కర్కోటకుడు కాటు వేశాడు

భార్యాబిడ్డలకు దూరమైన నలమహారాజు ఆడవిలో ఒంటరిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వుంటాడు. ఎక్కడికి వెళ్లాలో ... ఏం చెయ్యాలో అనే విషయంపై తనకంటూ ఒక నిర్ణయం లేక అలా ఆయన ముందుకి వెళుతూ వుంటాడు. అదే సమయంలో అడవి తగలబడిపోతూ ఆ మంటలు తనవైపు రావడాన్ని గమనిస్తాడు. అంతలో రక్షించండి అనే ఆర్తనాదం వినిపించిన వైపు చూస్తాడు.

అక్కడున్న మహాసర్పం తన పేరు 'కర్కోటకుడు' అని చెబుతుంది. వేగంగా వస్తోన్న మంటలు తనని సమీపించేలోగా రక్షించమని కర్కోటకుడు కోరతాడు. అది మహా విషసర్పం ... అయినా దాని ప్రాణాలను కాపాడటం కోసం నలుడు దానిని పట్టుకుని ఓ సురక్షితమైన ప్రదేశంలో వదులుతాడు.

ఆ మరుక్షణమే కర్కోటకుడు నలుడిని కాటు వేస్తాడు. ఊహించని ఆ సంఘటనకి నలుడు బిత్తరపోతాడు. విష ప్రభావం వలన ఆయన శరీరాకృతి గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. ఉపకారం చేసిన తనకి అపకారం చేయడం ఎంతవరకూ సమంజసమని అడుగుతాడు నలుడు. తాను అపకారం చేయలేదనీ ... ఉపకారమే చేశానని అంటాడు కర్కోటకుడు.

నలమహారాజు అలా వంటి నిండుగా సరైన వస్త్రం కూడా లేకుండా తిరగడం వలన మరిన్ని అవమానాలను పొందవలసి వస్తుందనీ, అది మరింత బాధకు గురిచేస్తుందని అంటాడు కర్కోటకుడు. అందువలన తన విష ప్రభావం వలన ఆయన రూపాన్ని మార్చేశానని చెబుతాడు. ఆయనని ఎవరూ గుర్తించరు కనుక ఎవరో ఏదో అనుకుంటారనే బాధ లేకుండా తిరగవచ్చని అంటాడు. ప్రస్తుతం ఆయన వున్నపరిస్థితుల్లో ఇతరులను ఆశ్రయించడం తేలిక అవుతుందని చెబుతాడు.

అందువలన సమయానికి తగిన విధమైన ఉపకారమే తాను చేశానంటూ, పరిస్థితులు అనుకూలించిన తరువాత విషానికి విరుగుడు లభించి ఆయనకి ఎలా పూర్వరూపం వస్తుందో కూడా చెబుతాడు. ఆ మాటల్లో నిజాన్ని గుర్తించిన నలుడు ... కర్కోటకుడి దగ్గర సెలవు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు.


More Bhakti News