అప్పన్ పేరుతో ఆదుకునే స్వామి

ఉషా అనిరుద్ధుల ప్రేమ - పరిణయం ఆసక్తికరమైన ఘట్టాలతో ... అనూహ్యమైన మలుపులతో కొనసాగుతూ ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీకృష్ణుడి మనవడైన అనిరుద్ధుడు, మహా శివభక్తుడు ... విష్ణుద్వేషి అయిన బాణాసురుడి కుమార్తె 'ఉష' ను ప్రేమిస్తాడు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్న కారణంగా వాళ్లిద్దరూ గాంధర్వ వివాహం చేసుకుంటారు.

విషయం తెలుసుకున్న బాణాసురుడు ఆగ్రహావేశాలకు లోనవుతాడు. తన కూతురైన ఉషను అంతఃపురంలోను ... అనిరుద్ధుడిని కారాగారంలోను బంధిస్తాడు. మనసిచ్చిన యువతిని వివాహం చేసుకున్న కారణానికి అనిరుద్ధుడిని బాణాసురుడు బంధించడం పట్ల కృష్ణుడు తీవ్రమైన అసహనానికి లోనవుతాడు.

శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. దాంతో ఆయనే స్వయంగా రంగంలోకి దిగడంతో, ప్రహ్లాదుడు కలుగజేసుకుని శ్రీకృష్ణుడిని శాంతింపజేస్తాడు. శివకేశవులకు భేదం లేదని బాణాసురుడి కళ్లు తెరిపిస్తాడు. ఇన్ని మలుపులకి కారణమైన ఉష - అనిరుద్ధుల కల్యాణం జరిగిన క్షేత్రంగా 'తిరుత్తంగాల్ ' కనిపిస్తుంది.

నూటాఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం, తమిళనాడు - శివకాశికి అత్యంత సమీపంలో అలరారుతోంది. ఇక్కడి స్వామి 'అప్పన్' పేరుతోను ... అమ్మవార్లు అన్ననాయకి ... అమృతనాయకి ... అనంతనాయకి పేర్లతోను పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు. వల్లభ మాహారాజుకి స్వామి ఇక్కడ ప్రత్యక్ష దర్శనం ఇచ్చినట్టుగా స్థలపురాణం చెబుతోంది.

ఇక్కడి పాపవినాశన తీర్థం విశేషమైనటువంటి మహాత్మ్యాన్ని కలిగి వుంటుంది. పురాణపరమైన నేపథ్యాన్ని ... చారిత్రక వైభవాన్ని కలిగి వున్న ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన ఆపదలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది.


More Bhakti News