స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడట !

సాధారణంగా ప్రతి ఆలయంలోను ఉదయాన్నే స్వామివారికి పులిహోర .. చక్రపొంగలి .. దధ్యోదనం వంటి పదార్థాలను తయారుచేసి దేవుడికి నివేదన చేస్తుంటారు. అలా భగవంతుడికి నైవేద్యంగా సమర్పించిన దానిని భక్తులకు ప్రసాదంగా పెడుతూ వుంటారు.

అక్కడి అర్చక స్వామిని అడిగి అదే విధంగా ... అన్ని రకాలు వేసి ఆ పదార్థాన్ని ఇంటి దగ్గర తయారు చేసుకున్నా ప్రసాదం రుచి రాదు. మామూలుగా చేసుకునే పదార్థానికి ... భగవంతుడికి నైవేద్యంగా సమర్పించిన పదార్థానికి ఆ తేడా తప్పక వుంటుంది. అందుకే ఆలయంలో ప్రసాదాన్ని స్వీకరించకుండా ఎవరూ వెనుదిరగరు.

అయితే కొన్ని గ్రామాల్లో గల ఆలయాలకి ఒక్కో రోజున భక్తులెవరూ రాకపోతే, ప్రసాదాన్ని ఒక్కరికైనా పెట్టలేకపోయామేనని అర్చకులు అనుకుంటారు. అలా ఒకసారి అర్చకులు బాధపడుతుంటే, సాక్షాత్తు భగవంతుడే బాలుడి రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరించిన క్షేత్రం ఒకటుంది. అదే శ్రీదేవి - భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్రం.

నల్గొండ జిల్లా 'తమ్మర బండపాలెం'లో మహిమాన్వితమైన ఈ సంఘటన జరిగిందని అర్చకులు చెబుతుంటారు. గరుడవాహనంపై వేంకటేశ్వరస్వామి దర్శనమిచ్చే ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. ఇక్కడి ఆలయానికి ఎప్పుడైనా భక్తులు రాని రోజున ... భక్తులెవరైనా వస్తే బాగుండేది ... ప్రసాదం పెట్టేవాళ్లమని అనుకున్నప్పుడు వెంటనే ఎవరో ఒకరు వచ్చి ప్రసాదం అడిగి తీసుకువెళ్లేవారట.

భక్తులు రాని రోజున ... ప్రసాదం అలాగే ఉండిపోయిందని అనుకున్నరోజున ఎవరో ఒకరు వెంటనే రావడం అర్చకులకు సందేహాన్ని కలిగించింది. ఒకసారి ప్రసాదమంతా అలాగే ఉండిపోయిన రోజున ఒక బాలుడు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించాడు. అర్చకులకు సందేహం కలిగి ప్రసాదం స్వీకరించిన బాలుడిని అనుసరించగా, ఆలయ ప్రాంగణం దాటి అదృశ్యమై పోయాడట.

అంతే అర్చకులకు విషయం అర్థమైపోయింది. అప్పుడప్పుడు స్వామివారు ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదం స్వీకరించి వెళుతూ ఉంటాడని వాళ్లు బలంగా విశ్వసిస్తూ వుంటారు. స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడని స్థానికులు కూడా పరిపూర్ణమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News