భక్తుల సందేహాన్ని తీర్చిన భగవంతుడు

అది ఒక చిన్న గ్రామం ... ఆ గ్రామంలో విశాలంగా పరచుకున్న బండ ఒకటుంది. ఎత్తు ఎక్కువగా లేకుండా విశాలంగా పరచుకున్న కొండని ఇక్కడి వాళ్లు 'బండ' అని పిలుస్తుంటారు. సాధారణంగా ఈ కొండపైకి పశువులు కాసే వాళ్లు ఎక్కువగా వచ్చేవాళ్లు. కొండ సమీపంలో పశువులు మేస్తూ వుంటే, వాటిని గమనిస్తూ పశువుల కాపర్లు ఒక గుంపుగా ఏర్పడి ఏవో ఆటలు ఆడుకుంటూ వుండేవారు.

అలాంటి పశువుల కాపరులు ఒక రోజున ఈ కొండపై దైవ రూపం వెలసి వుండటం చూసి, మిగతా గ్రామస్తులకు ఆ విషయాన్ని తెలియజేశారు. అందరూ ఆ స్వామిని దర్శించుకున్నారు. కొండ రాయిపై కనిపించేది 'రంగనాయక స్వామి' రూపమేనని కొంతమంది నిర్ధారించారు. అయితే స్వామివారు స్వయంగా వెలిశాడా ? ... ఎవరైనా చెక్కారా ? అనే విషయంలో వాళ్లకి సందేహం కలిగింది.

అప్పటికే ఆ గ్రామంలో వర్షాలు పడక చాలాకాలమైంది. బావులు ... చెరువులు కూడా ఎండిపోయాయి. అందువలన ఆ గ్రామస్తులు ... ఆ కొండ రాయిపై గల రూపం రంగనాయకస్వామిదే అయితే ... ఆయన స్వయంగా వెలిసివుంటే రెండు రోజుల్లో వర్షం కురవాలని అనుకున్నారు. బావులు ... చెరువులు నిండేలా వర్షం కురిస్తే తాము విశ్వసించి అనునిత్యం ఆరాధిస్తామని చెప్పుకుని వెనుదిరిగారు.

వాళ్లు అనుకుంటున్నట్టుగానే భారీ వర్షం కురిసి నీటి ఎద్దడి తీరింది. ఈ సంఘటనతో వాళ్ల సందేహాలు తీరిపోయాయి. ఆనాటి నుంచి ఇక్కడి స్వామిని గ్రామస్తులంతా కలిసి భక్తిశ్రద్ధలతో పూజిస్తూ వస్తున్నారు. రంగనాయకస్వామి శయనముద్రలో దర్శనమిచ్చే ఈ క్షేత్రం, నల్గొండ జిల్లా కోదాడ మండలం 'నెల్లిబండ' లో అలరారుతోంది.

అడగగానే జీవనాధారమైన నీటిని ప్రసాదించిన ఇక్కడి స్వామి మహిమన్వితుడని గ్రామస్తులు నమ్ముతుంటారు. ఓ వైపున స్వామివారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటూనే, మరోవైపున ఆలయాన్ని నిర్మించడానికి తగిన ఏర్పాట్లు చేయడంపై దృష్టిపెట్టారు.


More Bhakti News