అడవిలో ఆమెని ఏ శక్తి కాపాడింది ?

హంస రాయబారం వలన నలదమయంతులకు ఒకరిని గురించి ఒకరికి తెలుస్తుంది. వాళ్లిద్దరూ ఒకరిపై ఒకరు మనసు పారేసుకుంటారు. దమయంతి సౌందర్యం గురించి తెలిసిన నల మహారాజు ఆమె స్వయంవరానికి హాజరవుతాడు. నల మహారాజు శౌర్య పరాక్రమాలు ... ధర్మనిరతిని గురించి తెలుసుకున్న దమయంతి స్వయంవరంలో ఆయనను చేపడుతుంది.

విధి వక్రించడంతో ఆ దంపతులు అడవుల పాలవుతారు. అలా కొన్నిరోజుల పాటు అడవిలో ప్రయాణించిన ఆ దంపతులు అలసిపోయి ఒక చోట విశ్రమిస్తారు. తనతో పాటు దమయంతి అన్ని కష్టాలు పడుతుండటాన్ని నలమహారాజు తట్టుకోలేకపోతాడు. తాను వదిలేసి వెళ్లిపోతే ఆమె వెనుదిరిగి పుట్టింటికి వెళ్లిపోతుందనీ, అక్కడ ఎలాంటి కష్టాలు లేకుండా హాయిగా ఉంటుందని భావిస్తాడు.

ఆమెకి మెలకువ వచ్చేసరికి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కన్నీళ్ల పర్యంతమైన ఆమె ఆయనని వెతుక్కుంటూ బయలుదేరుతుంది. అడవిలో ఒంటరిగా వెళుతోన్న ఆమె ఓ సర్పం బారిన పడుతుంది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వేటగాడు ఆ పాముని చంపి ఆమె ప్రాణాలను కాపాడతాడు. ఆమె ఆ భయం నుంచి తేరుకుంటూ ఉండగానే, ఆ వేటగాడు ఆమెకి మరింత దగ్గరిగా వస్తాడు. ఆమె అందచందాలను గురించిన ప్రస్తావన చేస్తూ, తాకడానికి ప్రయత్నిస్తాడు.

ఊహించని ఆ సంఘటనకి దమయంతి ఆందోళన చెందుతుంది. తాను మరో ప్రమాదంలో పడ్డానని ఆమె గ్రహిస్తుంది. తనని రక్షించగలవారి కోసం అక్కడ ఎదురుచూడటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదనే విషయం ఆమెకి అర్థమైపోతుంది. వేటగాడు మరింత దగ్గరికి రాగానే, ఇక తన పాతివ్రత్యమే తనని కాపాడాలని అనుకుంటుంది. భర్తను తప్ప మరెవరి గురించిన ఆలోచన తాను కల యందు కూడా చేసి ఉండలేదనీ, తన భర్త పట్ల తాను నిర్వర్తిస్తూ వస్తున్నది పతివ్రతా ధర్మమే అయితే, ఆ వేటగాడు అక్కడే నిలువునా దహించుకుపోవాలని అంటుంది.

అంతే ... ఒక్కసారిగా దమయంతికీ వేటగాడికి మధ్య మంటలు అడ్డుగోడలా వ్యాపిస్తాయి. భయంతో ఆ వేటగాడు అక్కడి నుంచి పరుగందుకోవాలని ప్రయత్నిస్తూ ఉండగానే, ఆ మంటలు అతన్ని చుట్టుముట్టి నిలువునా దహించివేస్తాయి. అలా దమయంతి పాతివ్రత్యమే ఆ అరణ్యంలో ఆమెను రక్షిస్తుంది.


More Bhakti News