బాబా ప్రసాదించలేనిది ఏముంటుంది ?

శిరిడీలో గల సాయిబాబా మహిమలను గురించి చుట్టుపక్కల గ్రామాల్లో చెప్పుకుంటూ వుండే వాళ్లు. అలా బాబా గురించి అంతా చెప్పుకుంటోన్న మాటలు అంధుడైన ఓ వ్యక్తి చెవిన పడతాయి. చాలాకాలం క్రితం హఠాత్తుగా చూపు కోల్పోయిన ఆ వ్యక్తి, అప్పటి నుంచి నానాఅవస్థలు పడసాగాడు.

చూపురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోతుంది. దాంతో ఇక తనకి చూపురాదని నిర్ధారణ చేసుకుని నిరాశతో జీవితాన్ని కొనసాగిస్తూ వుంటాడు. అలాంటి వ్యక్తికి ఇరుగు పొరుగు వారి ద్వారా బాబాను గురించి తెలుస్తుంది. దాంతో ఒక్కసారి బాబాను చూడాలని అనిపిస్తుంది. ఆయనను చూసిన తరువాత ఇక శాశ్వతంగా చూపురాకపోయినా ఫరవాలేదని అనుకుంటాడు.

చూపు వచ్చినా రాకపోయినా బాబా సన్నిధిలో ఉండిపోవాలని నిర్ణయించుకుని, ఆ ఊరు నుంచి శిరిడీ వెళ్లే వాళ్లతో కలిసి బయలుదేరుతాడు. అలా శిరిడీ వరకూ నడచి వెళ్లిన ఆ వ్యక్తికి ... ఆ ఊళ్లోకి అడుగుపెడుతూనే చూపువస్తుంది. అంతే ఆయన సంతోషంతో పొంగిపోతూ ... బాబా వుండే మశీదు వైపుకి పరుగులు తీస్తాడు. బాబా కనిపించగానే ఆయన పాదాలపై పడతాడు.

బాబా ఆయనని పైకి లేవనెత్తి, తాను అందంగా కనిపిస్తున్నానా ? అని నవ్వుతూ అడుగుతాడు. అంతే ... ఆ వ్యక్తి ఒక్కసారిగా పెద్దగా ఏడుస్తాడు. తనకి చూపు వచ్చిందనే సంతోషం కన్నా, ఆ చూపుతో బాబాను చూడగలిగినందుకు ఆనందంగా వుందని చెబుతాడు. ఇక తన జీవితాన్ని ఆయన సన్నిధిలో తరింపజేసుకునే అవకాశాన్ని ప్రసాదించమంటూ సాష్టాంగ నమస్కారం చేస్తాడు.


More Bhakti News