మహిమగల నరసింహుడు

లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించిన అత్యంత విశిష్టమైన క్షేత్రాల్లో 'ఉర్లుగొండ' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. అనేక విశేషాలకు నెలవుగా కనిపించే ఈ క్షేత్రం నల్గొండ జిల్లా 'చివ్వెంల' మండల పరిధిలో వెలుగొందుతోంది. ఇక్కడి స్వామి ఏడుకొండలకు ... ఏడు ప్రాకారాలకి మధ్యలో గల మరో కొండపై కొలువుదీరి వుండటం విశేషం.

పూర్వం 'మట్టిపట్నం' పేరుతో పిలవబడిన ఈ క్షేత్రం, ఆనాటి నుంచి తన ప్రత్యేకతను చాటుకుంటూనే వుంది. చోళులు ... చాళుక్యులు ... కాకతీయుల కాలంలో ఈ క్షేత్రం ఎంతో వైభవంతో వెలుగొందింది. స్వామివారిని అనునిత్యం సేవించుకోవాలనే ఉద్దేశంతో అప్పట్లో నిర్మించబడిన రాజమందిరం ... మంత్రి నివాసం ... సిబ్బంది గృహాలు ఇక్కడ ఉండేవట. ఆ తరువాత కాలంలో జరిగిన మతపరమైన దాడుల్లో అవి ధ్వంసం చేయబడినట్టు చెబుతారు.

ఈ క్షేత్రాన్ని అష్టాదశ కాలభైరవులు ... ఎనిమిది మూర్తులుగా హనుమంతుడు సంరక్షిస్తూ ఉంటారంటే, ఇది ఎంతటి మహిమాన్వితమైన ... శక్తిమంతమైన క్షేత్రమో అర్థం చేసుకోవచ్చు. పద్ధెనిమిదిమంది కాలభైరవులను ... హనుమంతుడి ఎనిమిది మూర్తులను ఇప్పటికీ ఇక్కడ చూడవచ్చు. మతపరమైన దాడుల్లో ఈ క్షేత్రం దెబ్బతిన్నప్పుడు, ఇక్కడి గిరిజనులే స్వామివారికి దీపం పెట్టి నైవేద్యాలు సమర్పించేవారట.

ఆ తరువాత ఒక భక్తుడు స్వామివారికి మొక్కుకుని తన సంకల్పం నెరవేరిన కారణంగా ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి స్వామివారికి నిత్య దీప ధూప నైవేద్యాలు కొనసాగుతూ వస్తున్నాయి. కొండరాయిపై వెలసిన స్వామివారు దీపం వెలుగులోనే తప్ప ... కరెంటు వెలుగులో కనిపించకపోవడం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు.

రాజులకాలంలో అంటే .. ఓ వెయ్యి సంవత్సరాల క్రితం ఒక మహామంత్రి తవ్వించిన బావి,'మంత్రిబావి' పేరుతో ఇప్పటికీ స్వచ్ఛమైన జలాలను అందించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక మతపరమైన దాడుల్లో ఆలయం దెబ్బతిని ... తిరిగి ఆలయ నిర్మాణం జరగడానికి మధ్య కాలంలో, కొంతమంది ఈ స్థలాలను ఆక్రమించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారట. స్వామి ఆగ్రహించడంతో వాళ్లు తగిన ఫలితాన్ని పొందారని స్థానికులు చెబుతుంటారు.

ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున మాసోత్సవం పేరుతో స్వామివారి కల్యాణం, చైత్ర మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. ఇక్కడి స్వామి పిలిస్తే పలుకుతాడనీ ... కోరిన వరాలను ప్రసాదిస్తాడని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. స్వామికి జరిగే ప్రత్యేక పూజల్లోనూ ... సేవల్లోను పాల్గొంటూ పునీతులవుతుంటారు.


More Bhakti News