నాగేంద్రుడి అనుగ్రహం ఇలా దక్కుతుంది !

శ్రావణ శుద్ధ పంచమి 'నాగపంచమి' గా చెప్పబడుతోంది. ఈ రోజున నాగేంద్రుడిని పూజించడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. వైకుంఠంలో శ్రీమహావిష్ణువు శేష పాన్పుపై శయనముద్రలో దర్శనమిస్తూ వుంటాడు. ఇక పరమశివుడు కైలాసంలోనే కాదు, ఎక్కడికివెళ్లినా కంఠాభరణంగా సర్పరాజు కనిపిస్తుంటాడు. శివకేశవులు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చిన కారణంగానే నాగజాతికి దేవతా స్థానం లభించింది.

ఈ కారణంగానే నాగదేవతను ఆరాధించడం ఆరంభమైంది. పంటలకు హానిచేసే క్రిమికీటకాలను సర్పాలు ఆహారంగా తీసుకుంటూ వుంటాయి. అందువలన ఇవి పంటలను రక్షిస్తూ రైతులకు నష్టం కలగకుండా కాపాడుతూ వుంటాయి. అందుకు కృతజ్ఞతగానే కాకుండా ... నిరంతరం పొలాల్లో .. చేలల్లో తిరిగే తమకి ఎలాంటి విషబాధలు కలగకుండా చూడమని పల్లె ప్రజలు నాగదేవతను పూజిస్తుంటారు.

ఇక వివిధ కారణాల వలన కొంతమంది సర్ప దోషంతో బాధలు పడుతుంటారు. అలాంటి వాళ్లు నాగపంచమి రోజున నాగదేవతను ఆరాధిస్తే, ఆ దోషం తొలగిపోతుందని చెప్పబడుతోంది. శ్రావణ శుద్ధ పంచమి రోజున పూజా మందిరంలో నాగేంద్రుడి చిత్రపటాన్నిగానీ ... అయిదు పడగలు కలిగిన సర్ప ప్రతిమను కాని ఏర్పాటు చేసుకుని పంచామృతాలతో అభిషేకించవలసి వుంటుంది.

అత్యంత భక్తి శ్రద్ధలతో ఎర్రని పూలతో పూజించి పాలు ... నువ్వుల పిండినీ .. చలిమిడిని నాగరాజుకి నైవేద్యంగా సమర్పించవలసి వుంటుంది. తెలుసో తెలియకో సర్పాలకి హాని తలపెట్టి సర్పదోషం బారిన పడినవాళ్లు, ఈ రోజున నాగారాధన తప్పకచేయాలి. ఇక నాగుల పట్ల కృతజ్ఞతతో ఈ రోజున రైతులు భూమిని దున్నకుండా వుండాలి. నాగరాజుని పూజించిన అనంతరం చలిమిడిని నైవేద్యంగా సమర్పించడం వలన ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా దక్కుతుందని చెప్పబడుతోంది.


More Bhakti News