కోరికలు నెరవేర్చే కోదండరాముడు

శ్రీరాముడు ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాడు ... లోకానికి ధర్మమార్గాన్ని చూపించాడు. ఈ కారణంగానే రాముడికి ప్రజలు ఊరూరా గుడికట్టి పూజించుకుంటూ వుంటారు. శ్రీరామనవమిని అత్యంత ముఖ్యమైన పండుగగా భావించి ఉత్సాహంగా జరుపుకుంటూ వుంటారు. అలా సీతారాముల సేవలో తరించే గ్రామాలలో ఒకటిగా 'బాణాపురం' కనిపిస్తూ వుంటుంది.

ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది. భక్తుల సంకల్పం మేరకు చాలాకాలం క్రితమే ఇక్కడ రామాలయం నిర్మించడం జరిగింది. గర్భాలయంలో సీతారామలక్ష్మణులు ... హనుమంతుడు కొలువుదీరి వుంటారు. గ్రామస్తులందరూ ఇక్కడి కోదండరాముడిని కొండంత ప్రేమతో కొలుస్తుంటారు. ఎన్నో కష్టాలను అనుభవించిన సీతారాములు, తమ కన్నీళ్లను తుడవడానికే తమ గ్రామంలో కొలువుదీరారనే ఆలోచనే వాళ్లలో భక్తి భావాలను వికసింపజేస్తూ వుంటుంది.

తమ కష్టనష్టాలు తీర్చి ... కోరికలు నెరవేర్చేది సీతారాములేనని వాళ్లంతా బలంగా విశ్వసిస్తూ వుంటారు. ఆయన అనుగ్రహంతోనే సకల శుభాలు చేకూరతాయని చెబుతూ వుంటారు. తమ రాముడు ... తమ దేవుడు అన్నట్టుగా పర్వదినాల సమయంలో గ్రామస్తులంతా తప్పకుండా ఆలయానికి వస్తుంటారు. భజనలు ... కోలాటాలతో సందడి చేస్తుంటారు. స్వామివారి సేవల్లో సంతోషంగా పాల్గొంటూ సంతృప్తి చెందుతుంటారు.


More Bhakti News