అందుకే ఆయన్ని అంతా స్మరిస్తుంటారు

నీతికి నిలబడటానికి ... ధర్మానికి కట్టుబడి ఉండటానికి ఎంతో ధైర్యం కావాలి. రెండింటితో కలిసి కొనసాగించే జీవితంలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ వుంటాయి. వాటన్నింటినీ ఎదుర్కునే ఆత్మవిశ్వాసం కావాలి. తన వారు ... పరవారు అనే భేదం లేకుండా అందరినీ ఒకేలా చూసే సమదృష్టిని కలిగివుండాలి.

అలా ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపిన సత్యసంధుడుగా హరిశ్చంద్రుడు కనిపిస్తాడు. కాలపరీక్ష కారణంగా కాలకౌశికుడు దగ్గర చంద్రమతి దాసీగా వుంటుంది. ఇక తన ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకున్న హరిశ్చంద్రుడు, వీరబాహుడి బానిసగా కాటికాపరిగా వుంటాడు. పరమేశ్వరుడి లీలావిశేషాలను తలచుకుంటూ వీరబాహుడు అప్పగించిన పనిని చేస్తుంటాడు.

అలాంటి పరిస్థితుల్లో ఒకరోజున చంద్రమతి, లోహితాస్యుడి శవాన్ని తీసుకుని స్మశానానికి వస్తుంది. అసలే పుట్టెడు దుఃఖంతో వున్న ఆమె, కాటికాపరి స్థానంలో వున్న భర్తను చూసి అక్కడే కుప్పకూలిపోతుంది. తమ కుమారుడు పాముకాటు కారణంగా మరణించాడని తెలుసుకున్న హరిశ్చంద్రుడు ఎంతగానో విలపిస్తాడు.

ప్రస్తుతం తాను పని చేస్తున్నది స్మశానంలోనే అయినా, తన యజమాని వీరబాహుడి ఆదేశాన్ని అతిక్రమించలేననీ, కాబట్టి కాటి సుంకం చెల్లించకుండా లోహితాస్యుడి అంత్యక్రియలు జరపడం కుదరదని భార్యతో చెబుతాడు హరిశ్చంద్రుడు. తన భర్త ధర్మం తప్పడని తెలిసిన ఆమె, కాలకౌశికుడిని అడిగి కాటి సుంకం తీసుకురావడానికి వెళుతుంది. ఈ దృశ్యం చూసిన ఇంద్రాది దేవతలు మనసులో హరిశ్చంద్రుడిని అభినందించకుండా వుండలేకపోతారు.


More Bhakti News