అడుగడుగునా మహిమాన్వితమే !

లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రాల్లో పెంచలకోన లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం ఒకటిగా చెప్పబడుతోంది. ప్రాచీనకాలం నుంచి అనేక విశేషాలకు ... మహిమలకు నెలవుగా ఈ క్షేత్రం కనిపిస్తుంది. ఇక్కడ అడుగుపెట్టగానే దేవతా భూమిలోకి ప్రవేశించినట్టుగా అనిపిస్తూ వుంటుంది. ఈ కారణంగానే 'కణ్వమహర్షి' ఇక్కడ తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడని చెబుతారు.

ఇక్కడి ఏరు పక్కనే ఆయన జపతపాలు చేసుకోవడం వల్లనే దానికి 'కణ్వ ఏరు' అనే పేరు వచ్చిందనీ, కాలక్రమంలో అది 'కండలేరు' గా పిలవబడుతోందని అంటారు. ఈ క్షేత్ర మహాత్మ్యం గురించి తెలుసుకున్న సీతారామలక్ష్మణులు ఇక్కడ కొంతకాలం వున్నారని అంటారు. వారి పాద స్పర్శచే పావనమైన ఇక్కడి తీర్థాన్ని 'శ్రీరామపుష్కరిణి' పేరుతో పిలుస్తుంటారు. ఇక్కడి స్వామివారిని దర్శించి ఎంతో మంది మహర్షులు మోక్షాన్ని పొందారనీ, రాజులు విజయాలను సాధించారని చెబుతుంటారు.

ఇప్పటికీ దేవతలు రాత్రి సమయాల్లో వచ్చి స్వామివారిని సేవిస్తుంటారని అంటారు. అందుకు నిదర్శనంగా ఆ సమయంలో అప్పుడప్పుడు ఆలయంలో నుంచి గంట ధ్వనులు వినిపిస్తూ ఉంటాయని చెబుతుంటారు. ఇలా ఇక్కడ చూడదగిన ప్రదేశాలు ... తెలుసుకోవలసిన ఆసక్తికరమైన సంఘటనలు ఎన్నో వుంటాయి. అందుకే అడుగడుగునా అనేక విశేషాలను ఆవిష్కరిస్తూ ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా అలరారుతోంది.


More Bhakti News