గర్భగుడి

దేవాలయములో 'మూలవిరాట్టు'గల ప్రదేశాన్ని'గర్భగుడి'అని అంటారు. శబ్దాన్ని బట్టి రాయి జాతిని నిర్ణయించి దానిని మూలవిరాట్టుగా మలిచి యంత్ర సహితంగా గర్భాలయములో ప్రతిష్ఠ చేస్తారు. ఆలయము ఎంత విశాలంగా ఉన్నప్పటికీ గర్భగుడి మాత్రం చాలా చిన్నదిగా వుంటుంది. ఆలయంలో శిల్ప సంపద ... విద్యుత్ కాంతులు కనిపిస్తాయి. కానీ గర్భాలయంలో అలాంటివేమీ వుండవు. దైవం కేవలం తన ఎదురుగా ఉండే 'దీపారాధన' వెలుగులో మాత్రమే కనిపిస్తుంటుంది.

గర్భాలయంపై గల విమానం ఎత్తుకూడా చాలా తక్కువగానే వుంటుంది. ఈ విమానంపై ఒక కలశం మాత్రమే వుంటుంది. రాగితో తయారు చేయబడిన ఈ కలశానికి బంగారు పూత పూయిస్తారు. నవగ్రహాల నుంచి ... 27 ప్రధాన నక్షత్రాల నుంచి వచ్చే శక్తిమంతమైన కిరణాలను ఈ కలశం గ్రహించి, ఆ శక్తిని గర్భాలయంలోని యంత్రములనబడే రాగిరేకులకు చేరవేస్తుంది. అప్పుడు ఆ శక్తిని వాటి నుంచి విగ్రహము గ్రహిస్తుంది. దేవాలయానికి వెళ్లి అక్కడి దైవాన్ని దర్శించినప్పుడు ఈ శక్తి సహజంగానే భక్తుల దేహంపై ప్రభావం చూపి ఆరోగ్యాన్నిస్తుంది.

గర్భాలయం ఒక శక్తి కేంద్రంగా పనిచేస్తుంది కనుకనే ఆ శక్తి అన్ని దిక్కులకు వెళ్లకుండా ఒక వైపుకు మాత్రమే వెళ్లాలని 'ఆగమ శాస్త్రం'చెబుతోంది. ఈ కారణంగానే గర్భాలయానికి కిటికీలు కూడా లేకుండా, ఒకే ఒక ద్వారం మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఆ వైపు నుంచి మాత్రమే భక్తులు దైవాన్ని దర్శించి ఆయన నుంచి తమకి కావలసిన శక్తిని పొందుతుంటారు.


More Bhakti News