నిజభక్తులను పరీక్షించి నిలిచినవాళ్లు లేరు

వేదాంత దేశికులవారి పేరు వినగానే ఆయన రచించిన 'గరుడ దండకం' ప్రస్తావన వస్తుంది. అత్యంత శక్తిమంతమైనదిగా చెప్పబడుతోన్న ఈ గరుడ దండకాన్ని ఆయన ఆశువుగా చెప్పాడని అంటారు. అలా ఆయన ఆశువుగా ఈ దండకాన్ని చెప్పిన సందర్భం కూడా ఆసక్తికరంగా అనిపిస్తూ వుంటుంది.

ఒకసారి ఆయన దగ్గరికి ఒకవ్యక్తి వస్తాడు .. ఆయన దగ్గర గల బుట్టల్లో వివిధ రకాల జాతులకి సంబంధించిన శక్తిమంతమైన పాములు వుంటాయి. తనకి తెలిసిన మంత్ర విద్యలతో ఆ పాములను వశపరచుకుని, వాటి ద్వారా ఆయన ఉపాధిని పొందుతూ వుంటాడు.

దేశికులవారిని కలుసుకుని, ఆయన ఘనతను గురించి అంతా చెప్పుకుంటూ వుంటే విన్నానని అంటాడు. ఆయన గొప్పతనాన్ని తాను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నానని చెబుతాడు. తన దగ్గర గల విషసర్పాలను వదులుతాననీ, అవి ఆయనని సమీపించలేకపోతే ఆయన గురించి అంతా చెప్పుకునేది నిజమేనని నమ్ముతానని అంటాడు.

మౌనంగానే దేశికులవారు అందుకు అంగీకరించడంతో, ఆ వ్యక్తి తన దగ్గర గల బుట్టల్లో నుంచి విష సర్పాలను వదులుతాడు. వేగంగా దేశికులవారి వైపు వెళ్లడానికి ప్రయత్నించిన పాములు, ఏదో మంత్రం వేసినట్టుగా ఆయనకి దూరంగా ఆగిపోతుంటాయి. ఒక పాము మాత్రం ఆయన వైపు దూసుకు వస్తుంటుంది. అది అత్యంత శక్తిమంతమైనదిగా గుర్తించిన దేశికులవారు గరుత్మంతుడిని స్మరిస్తాడు.

అంతే .. సరిగ్గా ఆ సర్పం దేశికుల వారిని సమీపిస్తూ వుండగా, ఆకాశంలో నుంచి రివ్వున దూసుకు వచ్చిన ఓ గరుడ పక్షి ఆ పామును తన్నుకుపోతుంది. ఈ సందర్భంలోనే దేశికులవారు గరుడ దండకాన్ని ఆశువుగా చెప్పడం జరిగిందట. ఆయన శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షంగా చూసిన ఆ వ్యక్తి నివ్వెరపోతాడు. ఆయనని పరీక్షించేంతటి సాహసానికి పూనుకున్నందుకు మన్నించమని కోరతాడు. నిజమైన భక్తులను పరీక్షించి నిలిచినవాళ్లు ... గెలిచినవాళ్లు లేరని ఈ సంఘటన మరోమారు లోకానికి స్పష్టం చేసింది.


More Bhakti News