ధర్మమే విజయాన్ని ప్రసాదిస్తుంది

లోకంలో ధర్మ మార్గాన్ని అనుసరించడం అంత తేలికైన విషయం కాదు. ధర్మాన్ని ఆచరించడంలో ఎన్నో కష్ట నష్టాలు ఎదురవుతూ వుంటాయి. వాటన్నింటినీ తట్టుకుంటూ చివరి వరకూ పోరాడవలసి వుంటుంది. అప్పుడే ధర్మం తనని ఆశ్రయించిన వారికి విజయాన్ని ప్రసాదిస్తూ వుంటుంది. ఇక అధర్మాన్ని అనుసరిస్తోన్నవారి ఇంటికి సంపదలు ఎక్కువగా చేరుతుంటాయి. అందువలన వాళ్లు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. సమాజంలో అన్ని రకాల గౌరవాలను వాళ్లు పొందుతుంటారు.

అలాంటి వాళ్లను ఉదాహరణగా చూపిస్తూ ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తోన్న వాళ్లను కొందరు అవహేళన చేస్తుంటారు. ధర్మమంటూ కూర్చుంటే, దరిద్రమే తప్ప మరేమీ మిగలదని నిరుత్సాహ పరుస్తుంటారు. సుఖాలను అనుభవించాలంటే అధర్మ మార్గంలోకి అడుగు పెట్టవలసిందేనంటూ ప్రోత్సహిస్తుంటారు. నిజానికి అధర్మ మార్గంలో సంపాదించేది ఏదైనా అది తాత్కాలికమైనదే.

అధర్మంగా వచ్చిన సంపాదన వలన మనశ్శాంతి లేకుండా పోతుంది. మంచి కార్యాలకు ఆ ధనం ఉపయోగపడదు. అధర్మంగా వచ్చింది కనుక దాని తాలూకు ఆందోళన ఎప్పుడూ వెంటాడుతూనే వుంటుంది. చాటుగా విమర్శించే వాళ్లు ఎక్కువై పోతుంటారు. ఒక్కోసారి పరువు ప్రతిష్ఠలు కోల్పోయి తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది.

ఇక ధర్మం బద్ధమైన మార్గంలో వచ్చే సంపాదన కొంతే అయినా, అది ఎంతో సంతోషాన్నీ ... సంతృప్తిని ఇస్తుంది. ఆ ధనంతో ఏ కార్యాన్ని తలపెట్టినా మంచే జరుగుతుంది ... విజయమే వరిస్తుంది. అలాంటి వాళ్లు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తే, భగవంతుడు అనేక రూపాల్లో వచ్చి వాళ్లని ఆదుకుంటూ వుంటాడు. ధర్మమే జయిస్తుందనే విషయాన్ని అందరి అనుభవంలోకి తెస్తుంటాడు.


More Bhakti News