గంగాజలంతో అభిషేకిస్తే కలిగే ఫలితం !

ఆదిదేవుడు అభిషేక ప్రియుడు కనుక ... ఆయన అనుగ్రహాన్ని ఆశించే భక్తులు పర్వదినాల్లో ఆలయానికి వెళ్లి పంచామృతాలతో అభిషేకిస్తుంటారు. ఇక పూజామందిరంలో శివయ్యకి నిత్యార్చన చేసుకునే వాళ్లు, ఆయనని వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకిస్తుంటారు. ఒక్కో రకమైన అభిషేక ద్రవ్యాన్ని ఉపయోగించడం వలన ఒక్కో విశేష ఫలితం కలుగుతుందని చెప్పబడుతోంది.

అందువలన ఆయా పుణ్యఫల విశేషాలను ఆశించే వాళ్లు ఆయా ద్రవ్యాలతో స్వామిని అభిషేకిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని ఆశించే వాళ్లు 'పెరుగు'తోను ... ఐశ్వర్య వృద్ధిని కోరుకునే వాళ్లు 'ద్రాక్షపండ్ల రసం' తోను ... శివుడిని అభిషేకిస్తుంటారు. సుఖసంతోషాలతో కూడిన జీవితాన్ని కోరుకునే వాళ్లు స్వామికి ఈ ద్రవ్యాలతో అభిషేకం జరుపుతుంటారు.

ఈ నేపథ్యంలో 'గంగా జలం' అత్యంత పవిత్రమైనది కదా ... దానితో శివుడిని అభిషేకించడం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందనే సందేహం కొంతమందికి కలుగుతుంటుంది. గంగాజలంతో శివుడిని అభిషేకించడం వలన 'శివ సాయుజ్యం' లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

జీవితంలో ఒక దశ వరకూ కోరికలను నెరవేర్చుకోవడం కోసం భగవంతుడిని ఆశ్రయించడం జరుగుతుంది. ఆ తరువాత .. ఇక చాలు ... మళ్లీ జన్మ అనేదే వద్దనిపిస్తుంది. శివుడిలో ఐక్యమైపోవడమే జీవితానికి గల పరమార్ధమని అనిపిస్తుంది. అలా శివ సాయుజ్యాన్ని కోరుకునే వాళ్లు ఆ స్వామిని గంగా జలంతో అభిషేకించడం వలన ఆశించిన ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది.


More Bhakti News